స్థానికత నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాల జారీకి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకం వర్తింపులో పరిగణనలోకి తీసుకునే స్థానికత నిర్ధారణకు సంబంధించిన మార్గదర్శకాల జారీకి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. వీటిని పది రోజుల్లోగా జారీ చేయాలని యోచిస్తోంది. ఫీజుల చెల్లింపు నిబంధనల కంటే ముందు స్థానికత నిర్ధారణకు మార్గదర్శకాలు ప్రధానమైనందున వాటి ని రూపొందించడంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో విద్యార్థులకు నివాస ధ్రువీకరణ పత్రాలను జారీ చేయవద్దని రెవెన్యూ శాఖ తహసీల్దార్‌లకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా స్థానికతకు మార్గదర్శకాలను జారీ చేయాలని భావిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాలు వెలువడితేనే రెవెన్యూ యంత్రాంగం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.
పాత రికార్డులను అందుబాటులోకి తేవడం, స్థానికత నిర్ధారణకు పరిగణనలోకి తీసుకునే తదుపరి అంశాలపై చర్యలు చేపట్టడం సాధ్యమవుతుంది. ఆ తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయడం కుదురుతుంది. అందుకే త్వరగా మార్గదర్శకాలను రూపొందించేందుకు సంక్షేమ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో ఒకటీ రెండు రోజుల్లో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఐఏఎస్ అధికారులతో ఏర్పడే ఈ కమిటీ వారం రోజుల్లో మార్గదర్శకాలను రూపొందించి సీఎం కేసీఆర్‌తో చర్చించనుంది. అనంతరం ఉత్తర్వుల రూపంలో మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఇక ఫాస్ట్‌కు సంబంధించిన నిబంధనల రూపకల్పన చివరి దశకు చేరుకుంది. ఇందులో విద్యార్థి కనీస హాజరు, ఉత్తీర్ణత శాతం వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలి సింది. నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు, ప్రతిభావంతులైన విద్యార్థులకే పథకాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. మొదటి సంవత్సరంలో ఆర్థిక సహాయం మంజూరైన విద్యార్థికి రెండో ఏడాది ఫీజు మంజూరు చేయాలంటే ఫస్టియర్‌లోనూ కనీస మార్కులు, హాజరు శాతం ఉండాలనే నిబంధనలను మార్గదర్శకాల్లో చేర్చుతున్నట్లు సమాచారం.