సోమవారం రాత్రి మొత్తం భారీ వర్షం
పోటెత్తిన పండమేరు.. అనంతపురం నగర శివారు కాలనీలు జలమయం
వరదపై ముందస్తు సమాచారం లేక కట్టుబట్టలతో మిగిలామని బాధితుల ఆవేదన
వందలాది ఎకరాల్లో నీట మునిగిన పంట పొలాలు
అనంతపురం అగ్రికల్చర్/పుట్టపర్తి అర్బన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు మొదలైన వాన జోరు మంగళవారం వేకువజాము వరకు కొనసాగింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో పలు మండలాల్లో కుంభవృష్టి కురిసింది. ఏకధాటిగా నాలుగైదు గంటలపాటు భారీ వర్షం కురవడంతో చాలా మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాప్తాడు మండలం బండమీదపల్లి చెరువు కట్ట తెగిపోయి దిగువ ప్రాంతానికి వరద పోటెత్తడంతో దాదాపు 70 గొర్రెలు కొట్టుకుపోయాయి.
రామగిరి, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, పెనుకొండ, కొత్తచెరువు, పుట్టపర్తి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో చిత్రావతి, వంగపేరు, కుషావతి, జయమంగళి నదులతోపాటు పలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన వరి, వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, కొర్ర, మొక్కజొన్న తదితర పంటలు వందలాది ఎకరాల్లో దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి రెండున్నర ఎకరాల్లో సాగు చేసిన ద్రాక్ష తోట మొత్తం నేలమట్టమయ్యింది.
రూ.20 లక్షలకు పైగా నష్టపోయినట్లు రైతు వాపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో రికార్డు స్థాయిలో 198.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో 89.4 మి.మీ., కంబదూరులో 65.4 మి.మీ., ఆత్మకూరులో 60 మి.మీ. చొప్పున భారీ వర్షం కురిసింది. కాగా.. రానున్న రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
పండమేరు ఉగ్రరూపం... నీట మునిగిన పలు కాలనీలు
ఎగువన భారీ వర్షాలు కురవడంతోపాటు కనగానపల్లి చెరువుకట్ట తెగిపోవడంతో పండమేరు ఉధృతంగా ప్రవహించింది. పండమేరు వెంబడి ఉన్న అనంతపురం నగర శివారులోని గురుదాస్ కాలనీ, ఆటో కాలనీ, వనమిత్ర పార్క్ వెనుక కాలనీలు, రామకృష్ణ కాలనీ, కళాకారుల కాలనీ, బృందావన కాలనీ, పరిటాల సునీతమ్మ కాలనీ, దండోరా కాలనీ, రాజరాజేశ్వరి కాలనీలు నీట మునిగాయి. సుమారు 300 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదపై అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఫలితంగా కట్టుబట్టలతో మిగిలామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment