అనంతపురం జిల్లాలో రథం దగ్ధం ఘటనలో రివర్స్ కేసు
కీలక సూత్రధారులైన టీడీపీ మద్దతుదారులను తప్పించే కుట్ర
టీడీపీ కుయుక్తులకు పోలీసుల సహకారం
అధికార పార్టీ నేతల ఒత్తిడితో తిమ్మినిబమ్మిని చేసే యత్నం
నేరంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడి పాత్ర ఉందన్న ఎస్పీ
వాస్తవంగా అతను టీడీపీ మద్దతుదారుడు
పోలీసుల తీరుపై విస్తుపోతున్న హనకనహాళ్ గ్రామస్తులు
సాక్షి టాస్క్ ఫోర్స్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ శ్రీరాములోరి రథం దగ్ధం కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారు. రథానికి నిప్పు పెట్టిన ఘటనలో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ సానుభూతిపరులేనంటూ సర్వత్రా కోడై కూస్తున్నా.. పోలీసులు మాత్రం ఆ నెపాన్ని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీపై నెట్టేస్తున్నారు. అధికార పార్టీ పెద్దల సూచనలకు అనుగుణంగా పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఈశ్వర్‌రెడ్డి అనే వ్యక్తిని బుధవారం అనంతపురంలో మీడియా ఎదుట హాజరు పరిచారు. రథానికి నిప్పు పెట్టడంలో ఈశ్వర్‌రెడ్డి పాత్ర ఉందని, ఇతను వైఎస్సార్‌సీపీకి చెందిన వాడని జిల్లా ఎస్పీ జగదీష్ ప్రకటించారు. వాస్తవంగా ఈశ్వర్‌రెడ్డి గత ఎన్నికల్లో టీడీపీకి పని చేశాడని, ఆ విషయాన్ని పోలీసులు దాచి.. వైఎస్సార్‌సీపీ ముద్ర వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రథం దగ్ధం తర్వాత పోలీసులు ఆధారాల సేకరణ కోసం డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. పోలీసు జాగిలాలు గ్రామంలోని నలుగురి ఇళ్ల వద్దకు వెళ్లాయి. ఆ నాలుగిళ్లూ టీడీపీ సానుభూతిపరులవే కావడం గమనార్హం. పోలీసుల ప్రాథమిక విచారణలోనూ టీడీపీకి చెందిన వారే ఈ పని చేసినట్లు తేలినప్పటికీ వారెవ్వరినీ నిందితులుగా చూపలేదు. ఆ పార్టీ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ కేసును తప్పుదారి పట్టిస్తున్నట్లు సమాచారం.
అన్ని వేళ్లూ వారి వైపే..
హనకనహాళ్ గ్రామంలో శ్రీరాములోరి రథం పట్ల ముందు నుంచీ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నది టీడీపీ వారే కావడం గమనార్హం. ఈ విషయం గ్రామస్తులందరూ చెబుతున్నప్పటికీ వైఎస్సార్‌సీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన మూలింటి ఎర్రిస్వామిరెడ్డి బ్రదర్స్ 2022లో రూ.19 లక్షల సొంత నిధులతో రథాన్ని తయారు చేయించారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులే ఈ రథాన్ని తయారు చేయించినప్పుడు అదే పార్టీకి చెందిన వారు ఎందుకు నిప్పు పెడతారని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం టీడీపీ వారే రథానికి నిప్పు పెట్టి.. ఆ నెపం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై నెట్టేలా వ్యూహం పన్నినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో గ్రామంలో ఇలాంటి సంఘటనలెన్నడూ జరగలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చాకే ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం చెప్పిందొకటి..జరిగింది మరొకటి..
కేసును నిష్పక్షపాతంగా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు చెప్పినప్పటికీ, మరోవైపు అందుకు భిన్నంగా జరుగుతోంది. దోషులు టీడీపీ వారేనని తేలినప్పటికీ, ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే ప్రభుత్వానికి మచ్చ రావడం ఖాయమని, వైఎస్సార్‌సీపీపైకి నెపం నెట్టాలని టీడీపీ పెద్దలు చెప్పడంతో పోలీసులు జీ హుజూర్ అన్నట్లు సమాచారం.
సీఎం వ్యాఖ్యలకు అర్థం ఇదేనని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతల మెప్పు కోసం పోలీసు యంత్రాంగం ఈశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేసి, అతను వైఎస్సార్‌సీపీ అని చెప్పడం గమనార్హం. పోలీసుల తీరు పట్ల గ్రామంలో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
రథానికి నిప్పు ఘటనలో ఒకరి అరెస్ట్: ఎస్పీ జగదీష్
అనంతపురం: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాళ్ గ్రామంలో శ్రీరాముల వారి రథానికి నిప్పంటించిన కేసులో అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు బి.ఈశ్వరరెడ్డిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హనకనహాళ్లో ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళాలను పగులగొట్టి మండపంలోకి ప్రవేశించి.. రథంపై పెట్రోల్/కిరోసిన్ పోసి నిప్పు పెట్టారని తెలిపారు. వెంటనే గ్రామస్తులు మంటలు ఆర్పారని, అప్పటికే రథం ముందు భాగం కాలిపోయిందన్నారు.
ఈ ఘటనపై కణేకల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారన్నారు. ఘటనా స్థలంలో ఆధారాల సేకరించామని చెప్పారు. రథాన్ని 2022లో గ్రామానికి చెందిన ఎర్రిస్వామి రెడ్డి సోదరులు రూ.20 లక్షలు వెచ్చించి తయారు చేయించారని తెలిపారు. గ్రామంలో ఏ ఒక్కరి సహాయ సహకారాలు తీసుకోకుండా వారి కుటుంబ సభ్యులే రథాన్ని స్వయంగా తయారు చేయించారన్నారు. దీంతో గ్రామస్తుల్లో విభేదాలు ఏర్పడ్డాయని చెప్పారు.
ఈ ఘటనలో గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోడిమల్ల ఈశ్వర రెడ్డి పాత్ర ఉన్నట్లు తెలియడంతో అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. పోలీస్ కస్టడీలోకి తీసుకుని, ఈ నేరంలో ఇంకా ఎవరి పాత్రయినా ఉందా అనే అంశంపై విచారిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment