
సాక్షి, హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) గురించి నీచంగా మాట్లాడతారా? మా ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తాం అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్టేట్ కన్వీనర్ నరేంద్ర చౌదరి. ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నరేంద్ర చౌదరి మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ సభ్యసమాజం తలదించుకునేలా నోటికి ఎంతొస్తే అంత వాగారు. మా ఎన్టీఆర్ తల్లిపై దారుణంగా కామెంట్స్ చేశారు.
క్షమాపణలు చెప్పాలి
ఎన్టీఆర్ తల్లినే కాదు, ఏ స్త్రీ మూర్తి గురించి అలా మాట్లాడకూడదు. అలా ఎవరు మాట్లాడినా తప్పే! ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది ఇంతటితో ఆపేస్తే బెటర్. ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని అనంతపురం నడిబొడ్డున క్షమాపణలు చెప్పాలి. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతాం. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరం ఛలో అనంతపురం అంటూ మీ ఇంటిని ముట్టడిస్తాం అని హెచ్చరించారు.
ఏం జరిగింది?
వార్ -2 రిలీజ్ సమయంలో అభిమానుల స్పెషల్ షోకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు ఆహ్వానించారు. దీంతో దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌పై రెచ్చిపోయారు. వాడి సినిమాలెలా ఆడనిస్తాను? మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. అంటూ అసభ్య పదజాలంతో హీరో గురించి నీచంగా మాట్లాడారు. ఎన్టీఆర్ తల్లిని సైతం దారుణంగా దూషించారు. వార్ 2 షోలను అనంతపురంలో నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై తారక్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

