
పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో కడుతున్న తల్లి
రాయదుర్గంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం
వైభవంగా శ్రీప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాలు
రాయదుర్గంటౌన్: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి కల్యాణం తొమ్మిదేళ్ల బాలికతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి ఇక్కడ కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయంలో భాగంగా అరవ తెగకు చెందిన బాలికతో దేవదేవుని కల్యాణం జరిపించారు. స్వామి వారిని వివాహమాడిన ఆ బాలికకు సుగుణ æసంపన్నుడైన భర్త లభిస్తాడని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.
ఈ ఏడాది రాయదుర్గం పట్టణానికి చెందిన అరవ రమే‹Ù, జయమ్మ దంపతుల కుమార్తె మౌనికతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు వ్యవహరించారు. శనివారం ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు అయిన పద్మావతి (మౌనిక)ని ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా తెచ్చారు. అనంతరం శ్రీవారి ఉత్సవ విగ్రహం ముందు కూర్చోబెట్టారు.
వేద మంత్రోచ్ఛారణ మధ్య వివాహం జరిపించారు. అభిజిత్ లగ్న శుభపుష్కరాంశమునందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో తల్లి కట్టడంతో పెళ్లితంతు ముగిసింది.