venkataramana swamy
-
తొమ్మిదేళ్ల బాలికతో దేవదేవుని వివాహం
రాయదుర్గంటౌన్: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి కల్యాణం తొమ్మిదేళ్ల బాలికతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి ఇక్కడ కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయంలో భాగంగా అరవ తెగకు చెందిన బాలికతో దేవదేవుని కల్యాణం జరిపించారు. స్వామి వారిని వివాహమాడిన ఆ బాలికకు సుగుణ æసంపన్నుడైన భర్త లభిస్తాడని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.ఈ ఏడాది రాయదుర్గం పట్టణానికి చెందిన అరవ రమే‹Ù, జయమ్మ దంపతుల కుమార్తె మౌనికతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు వ్యవహరించారు. శనివారం ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు అయిన పద్మావతి (మౌనిక)ని ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా తెచ్చారు. అనంతరం శ్రీవారి ఉత్సవ విగ్రహం ముందు కూర్చోబెట్టారు.వేద మంత్రోచ్ఛారణ మధ్య వివాహం జరిపించారు. అభిజిత్ లగ్న శుభపుష్కరాంశమునందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో తల్లి కట్టడంతో పెళ్లితంతు ముగిసింది. -
నేత్రపర్వం.. రథోత్సవం
మడకశిర : మడకశిరలోని కోట లక్ష్మీ వెంకటరమణస్వామి రథోత్సవం బుధవారం నేత్రపర్వంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తొలుత రథంలో ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి పూజలు చేశారు. ఆ తర్వాత దేవాలయం నుంచి తేరువీధి వరకు రథాన్ని లాగారు. తేరు లాగడానికి భక్తులు పోటీపడ్డారు. ఎమ్మెల్యే ఈరన్న, ఎమ్మెల్సీ గుండుమలతిప్పేస్వామి, మునిసిపల్ కమిషనర్ సంగం శ్రీనివాసులు, చైర్పర్సన్ శరణ్య, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున తహసీల్దార్ హరిలాల్‌నాయక్, డీటీ శ్యామలాదేవి తదితరులు పట్టు వస్త్రాలను శ్రీవారికి సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే వైవీ తిమ్మారెడ్డి జ్ఞాపకార్థం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులు కూడా శ్రీ వారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేయించారు. శ్రీ అయ్యప్పస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఎల్ఐసీ ఏజెంట్ శ్రీనివాసరావు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.