కులం పేరుతో దూషిస్తూ కొట్టి పంటను దున్నేసిన వైనం
అనంతపురం జిల్లా గాజుల మల్లాపురంలో ఘటన
సాక్షి టాస్‌్కఫోర్స్: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో ఆదివారం టీడీపీ నాయకులు రెచ్చి పోయారు. మాజీ వలంటీర్ దళితుడైన నాగరాజును కులం పేరుతో దూషించి దాడిచేశారు. అతడు కౌలుకు సాగుచేసిన మొక్కజొన్న పంట పొలాన్ని దౌర్జన్యంగా దున్నేశారు. బాధితుడు తెలిపిన మేరకు.. కూటమి ప్రభుత్వం వచ్చి న తర్వాత నాగరాజు వలంటీర్ ఉద్యోగం పోయింది. దీంతో వ్యవసాయం చేసుకుందామనుకున్న నాగరాజు గ్రామంలోని కొత్తింటి రామ్మోహన్, రుద్రగౌడులకు చెందిన ఎనిమిదెకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగుచేశాడు.
ఎకరాకు రూ.30 వేల చొప్పున మొత్తం రూ.2.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఆదివారం అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు గాజుల పెద్ద ఎర్రిస్వామి, చిన్న ఎర్రిస్వామి, వారి కుమారులు.. అనంతపురం నుంచి మరికొందరిని తీసుకొచ్చి నాగరాజు సాగు చేసిన మొక్కజొన్న పంటను హొన్నూరు అలియాస్ హరి అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌తో దున్నేశారు. పంటను నాశనం చేయవద్దని బాధితుడు కాళ్లావేళ్లాపడినా కరుణించలేదు. పొలంలోనే తీవ్రంగా కొట్టారు.
పొలం తగాదాలుంటే మీరూమీరూ చూసుకోవాలని, పంటను నాశనం చేయవద్దని వేడుకున్నా వినలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం మాది.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ దాడిచేశారని తెలిపాడు. తనకు జరిగిన అన్యాయంపై పాల్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పాడు.
అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
నాగరాజును కులం పేరుతో దూషించి, దాడిచేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్‌పీఎస్ జిల్లా నాయకుడు కెంగూరి ఎర్రిస్వామి డిమాండ్ చేశారు. దళితుడి పంటను దౌర్జన్యంగా దున్నేయడం దారుణమని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment