చంపాడులో టీడీపీ కార్యకర్తల బరితెగింపు
ఆమె ఇంటిపై రాళ్లు రువ్వి అంతు చూస్తామంటూ పోస్టర్
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం
వేమూరు: గ్రామ వలంటీర్‌పై టీడీపీ కార్యకర్తలు మహిళలతో దాడి చేయించి కొట్టిన ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం చంపాడులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎస్సీ మాదిగ వర్గానికి చెందిన పమిడిపాగుల జ్యోతి అనే మహిళ గ్రామ వలంటీర్‌గా పని చేస్తోంది. వలంటీర్లపై కూటమి నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్నికల ముందు ఆమె రాజీనామా చేశారు. కాగా.. ఎన్నికల్లో గెలిచాక టీడీపీ కార్యకర్తలు జ్యోతిని లక్ష్యంగా చేసుకుని వేధించటం మొదలుపెట్టారు. నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు.
‘మీ వైఎస్సార్‌సీపీ పార్టీ గెలవాలని ఓట్లు వేయించి తెగపాకులాడావుగా గొప్ప వాలంటీరు. ఇప్పుడు మాది రాజ్యం. నీ అంతు చూస్తాం. జై టీడీపీ, జై కూటమి’ అంటూ ఆ ఇంటి గోడపై పోస్టర్ అతికించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయింది. మరుసటి రోజునుంచి స్కూల్‌కెళ్తున్న జ్యోతి పిల్లలను దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం బజారు నుంచి ఇంటికెళ్తున్న జ్యోతిపై కొందరు మహిళలతో టీడీపీ నాయకులు దాడి చేయించి కొట్టించారు. కిందపడిపోయిన జ్యోతిని వేమూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అక్కడ ఆమె స్పృహ కోల్పోవటంతో 108 అంబులెన్స్‌లో తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ వేమూరు ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు హుటాహుటిన వేమూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జ్యోతిని పరామర్శించారు. నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటిపై రాళ్లురువ్వి పోస్టర్ అతికించినట్టు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవటంపై పోలీసులను ప్రశ్నించారు.
ఆ కేసుతో పాటు ఆదివారం జరిగిన దాడిపై కేసులోనూ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తేనే పోలీస్ స్టేషన్ నుంచి వెళతానని పట్టుబట్టారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటిపై జరిగిన రాళ్ల దాడిపై ఎఫ్‌ఐఆర్ తర్వాత ఇస్తామని ఎస్‌ఐ నాగరాజు వెల్లడించారు. వరికూటి అశోక్‌బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎక్కడైనా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే సహించబోమన్నారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తనతోపాటు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ నేతపై దాడి..
వేటపాలెం: బాపట్ల జిల్లా వేటపాలెం మండల పరిధిలోని బచ్చులవారిపాలెంలో వైఎస్సార్‌సీపీ నేత బచ్చుల బంగారు బాబు పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో శనివారం రాత్రి గంగమ్మ తల్లి కొలుపులు జరుగుతున్నాయి. అదే అదునుగా గ్రామంలో టీడీపీకి చెందిన ప్రధాన నాయకుడు వారి అనుచరులు నలుగురికి మద్యం తాగించి బంగారుబాబుపై దాడికి తెగబడ్డారు. దీంతో బంగారుబాబు తలకు తీవ్రగాయం అయ్యింది. అక్కడే ఉన్న కొంతమంది మహిళలు దాడిని అడ్డుకోవడంతో అతడిని వదిలేశారు.
కాగా, బంగారుబాబు వైఎస్సార్‌సీపీ తరఫున గ్రామంలో ప్రచారం చేసి ఓట్లు వేయించాడు. టీడీపీ చెందిన ఒక నాయకుడు గ్రామంలో టీడీపీ తరఫున పోటీ చేసిన మన సామాజిక వర్గం నాయకుడు కొండయ్యకు గ్రామం మొత్తం ఓట్లు వేద్దామని బంగారు బాబును అడిగారు. అందుకు అతను ఒప్పుకోకపోగా వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పాడు.
దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో టీడీపీ ఓట్లు చీలుస్తావా అని చెప్పి వారికి సంబంధించిన కొంత మందికి మద్యం తాగించి బంగారు బాబుపై దాడి చేయించాడు. తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు వాపోయాడు. తనకు, తన వర్గం వారికి రక్షణ కల్పించాలని కోరుతూ వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment