మిద్దె కూలి దంపతుల దుర్మరణం
అనంతపురం జిల్లాలో ఘటన
విడపనకల్లు : తెల్లారితే నూతన గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. పాత మిద్దె కూలి భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కోనప్పగారి మారెప్ప(42), లక్ష్మి(38) దంపతులు. వీరికి అంజి, హేమంత్ అనే ఇద్దరు కుమారులు, కుమార్తె మానస(మూగ) ఉన్నారు. మారెప్ప పెద్దలు దాదాపు 60 ఏళ్ల క్రితం మట్టితో కట్టించిన ఇంట్లోనే ఉండేవారు.
అయితే.. భార్యాభర్త కాయాకష్టం చేసుకుని సంపాదించిన డబ్బుతో ఇటీవల నూతన గృహాన్ని నిరి్మంచుకున్నారు. ఆదివారం గృహ ప్రవేశం పెట్టుకున్నారు. కాగా, శనివారం రాత్రి భారీ గాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. రోజూ మాదిరిగానే మారెప్ప, లక్ష్మి దంపతులు కుమార్తెతో కలసి పాత మట్టి మిద్దెలో పడుకున్నారు. వీరితో పాటు లక్ష్మి తమ్ముడు రాము కూడా అదే ఇంట్లో నిద్రించాడు. ఇద్దరు కుమారులు మాత్రం ఇంటి ఆరుబయట మంచంపై పడుకున్నారు. వర్షానికి తడిసిన కారణంగా మట్టి మిద్దె ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది.
పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కి పడి లేచారు. మారెప్ప ఇల్లు కూలిపోయిందని గమనించి అరుపులు, కేకలు వేయడంతో కాలనీవాసులంతా వచ్చి మట్టి కింద పూడుకునిపోయిన వారిని వెలికి తీశారు. అప్పటికే మారెప్ప, భార్య లక్ష్మి ప్రాణాలు విడిచారు. కుమార్తె మానసకు చేయి విరిగింది. రాముకు చేతులు, వేళ్లు విరగడంతో పాటు తలకు బలమైన గాయమైంది. గాయపడిన వారిని 108లో ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఘటనపై ఎస్‌ఐ ఖాజా హుస్సేన్ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment