
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ వెనక్కి వెళ్లిపోవడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వ తీరు, ఆ పార్టీ నేతల ఒత్తిళ్లే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంపై తెలుగుదేశం పార్టీ గోబెల్స్ ప్రచారానికి దిగింది. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు పచ్చమీడియాను అడ్డు పెట్టుకుంది. దాని సాయంతో ప్రస్తుత ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా జాకీ నేపథ్యంలో పుట్టుకొచ్చిన పత్రికా కథనాలు కూడా టీడీపీ మోసాలను కప్పిపుచ్చుకునేందుకే అన్నట్టు తేటతెల్లమవుతోంది. టీడీపీ నేతలకు ముడుపులు చెల్లించలేకనే జాకీ వెళ్లిపోయిందనేది వాస్తవం.
గుడ్‌విల్ కోసం పట్టుపట్టడంతో..
దుస్తుల తయారీ ఫ్యాక్టరీ పెట్టడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2017 సంవత్సరంలో జాకీ యాజమాన్యం ముందుకు వచ్చింది. రాప్తాడు వద్ద సుమారు 42 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండేది. 2017 అక్టోబర్ నాటికి భూమిని అభివృద్ధి చేయాలని, నవంబర్ నాటికి సివిల్ వర్క్ పూర్తి చేయాలని, 2018 ఆగస్ట్ నాటికి భవన నిర్మాణాలు పూర్తిచేసి, నవంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలనేది ప్రభుత్వ అగ్రిమెంటు. కానీ 2018 చివర్లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోతున్న దశలో ఆదరాబాదరాగా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి పూనుకున్నారు. అందులోనూ అప్పటి మంత్రి తనయుడు, సోదరుడు గుడ్‌విల్ కోసం పట్టుపట్టడంతోనే వాళ్లు వెనక్కు వెళ్లారన్నది అనంతపురం జిల్లాలో అందరికీ తెలిసిన విషయం.
ఈ ప్రభుత్వం వచ్చే నాటికే...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2019 మే 30న. అంతకుముందే జాకీ ప్రతినిధులు వెనక్కు వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ మంత్రి, తన సోదరుడి ఒత్తిడి మేరకు ఇక్కడ తాము పెట్టుబడులు పెట్టలేమని చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల పాటు కంపెనీ యాజమాన్యం ఒక్క ఇటుక కూడా వెయ్యలేక పోయింది. టీడీపీ, పచ్చమీడియా ఆరోపిస్తున్నట్లుగా 2019లో ఈ ప్రభుత్వం వచ్చాక జాకీ కంపెనీ వెళ్లిపోయి ఉంటే అంతకు ముందు పనులు జరిగి ఉండాలి కదా అన్నది సామాన్యుడి ప్రశ్న.
వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2018 అక్టోబర్ నాటికి ఫ్యాక్టరీ పనులన్నీ పూర్తి కావాలి. మరి అప్పటివరకూ కాంపౌండ్ వాల్ కూడా ఎందుకు నిర్మించలేక పోయారన్నది ప్రశ్నగానే ఉండిపోయింది. అనుమతులు పొందిన రెండేళ్ల వరకూ జాకీ యాజమాన్యాన్ని పనులు చేయనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుని, కోట్లాది రూపాయల కమీషన్లు డిమాండ్ చేయడం వల్లే వెనక్కు వెళ్లిపోయారనేది బహిరంగ రహస్యం. ముడుపుల పాపాలు కప్పిపుచ్చుకునేందుకు పచ్చమీడియాను రంగంలోకి దించారన్న విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment