కణేకల్లు(అనంతపురం జిల్లా): తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన అమ్మవారి దున్నపోతు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. అందుబాటులో ఉన్న ఒకేఒక దున్నపోతుతో అంబాపురం, రచ్చుమర్రి గ్రామస్తులు ఊరి దేవర జరుపుకునేందుకు సిద్ధమైన నేపథ్యం తెలిసిందే. ఈ క్రమంలో దున్నపోతు తమదంటే తమదంటూ ఇరు గ్రామాల ప్రజలు వాగ్వాదానికి దిగి 20 రోజులుగా ఉత్కంఠకు తెరలేపారు.
అసలేం జరిగిందంటే...
ఈ నెల 17న అంబాపురంలో దేవర నిర్వహించాలని గ్రామస్తులు నిశ్చయించిన నేపథ్యంలో అమ్మవారి పేరుతో వదిలిన దున్నపోతు కోసం దాదాపు 30 రోజులకు పైగా వివిధ ప్రాంతాల్లో గాలించి చివరకు బొమ్మనహాళ్ మండలంలో కనిపించిన దేవరపోతును తీసుకెళ్లి బంధించారు. ఈ విషయం తెలుసుకున్న రచ్చుమర్రి గ్రామస్తులు అంబాపురానికి వెళ్లి తమ గ్రామ దేవత పేరున వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారంటూ వాదనకు దిగారు. అప్పటి నుంచి ఈ రెండు గ్రామాల మధ్య దున్నపోతు పంచాయితీ నలుగుతూ వస్తోంది
ఎటూ తేల్చని పంచాయితీ..
ఇరు గ్రామాల ప్రజలను బుధవారం కణేకల్లు పోలీస్ స్టేషన్‌కు సీఐ యుగంధర్ పిలిపించుకుని మాట్లాడారు. ఒక్కొ గ్రామం నుంచి 80 నుంచి 90 మంది ప్రజలు తరలిరావడంతో పోలీస్ స్టేషన్ కిటకిటలాడింది. దున్నపోతును వదులుకునేది లేదంటూ అంబాపురం వాసులు వివరించారు. అయితే తమ గ్రామ దేవతకు సంబంధించిన దున్నపోతును తామూ వదులుకోబోమని రచ్చుమర్రి వాసులు తేల్చి చెప్పారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పంచాయితీ... మధ్యాహ్నం 1 గంట వరకూ సాగింది. సమస్యకు పరిష్కారం దక్కకపోవడంతో ఇరువైపులా ఐదుగురు చొప్పున గ్రామ పెద్దలను స్టేషన్ లోపలకు పిలుచుకెళ్లి సీఐ చర్చించారు. అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. అనంతరం ఎవరికి వారు ఆ దున్నపోతు తమదంటే తమదంటూ దేవుడిపై ప్రమాణాలు చేశారు. చివరకు టాస్ వేసి తుది నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. అయితే టాస్ వేస్తే తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఇరు గ్రామాల ప్రజల్లో తలెత్తి చివరకు ఈ అంశాన్ని కూడా విరమించుకున్నారు.
సెంటిమెంట్‌తో రాజీ కుదిర్చిన సీఐ..
చివరగా సీఐ యుగంధర్ ఇరు గ్రామాల పెద్దలను కూర్చొబెట్టి చర్చలు జరిపారు. ఈ నెల 17న అంబాపురంలో దేవర ఉందని, రచ్చుమర్రిలో దేవరకు ఇంకా ఏడాది గడువు ఉండడంతో దున్నపోతు కొనుగోలుకు అంబాపురం వాసులతో డబ్బిప్పిస్తానన్నారు. ఇది దైవ కార్యం కావడంతో అందరికీ మంచి జరుగుతుందని, మరో ఏడు రోజుల్లో ఊరి దేవర ఉండడంతో మంచి మనసుతో ఆలోచించి అంబాపురం వాసులకు సహకరించాలని, దీంతో అమ్మవారు కూడా శాంతిస్తారని సీఐ నచ్చచెప్పారు.
చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా?
సీఐ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రం రచ్చుమర్రి వాసులను ఆలోచనలో పడేసింది. చివరకు అంబాపురంలో దేవర ముగిసిన తర్వాత ఓ దున్నపోతును కొనిస్తామంటూ ఆ గ్రామస్తులు భరోసానివ్వడంతో ఇరు గ్రామాల మధ్య రాజీ కుదిరింది. ఎట్టకేలకు దున్నపోతు సమస్యకు పరిష్కారం దక్కడంతో అంబాపురం వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment