ప్రతీకాత్మక చిత్రం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా.. ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం రేషన్ కార్డు ఏ గ్రామంలో ఉంటే.. కార్డుదారులు అక్కడే సరుకులు తీసుకునే విధానం ఉండేది. దీనివల్ల బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కార్డుదారులు బియ్యం తీసుకునేందుకు ఇబ్బందిపడేవారు. ఇక అటువంటి వాటికి పౌరసరఫరాల శాఖ స్వస్తి పలకనున్నది. అమలులోకి రానున్న కొత్త విధానంతో జిల్లాలో ఎక్కడి నుంచైనా లబ్ధిదారులు సరుకులు తీసుకునే వీలు కలగనుంది.
జిల్లాలోని 21 మండలాల్లో గల 669 రేషన్ దుకాణాలకు ప్రతి నెలా 7,251 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. వీటిని డీలర్లు ప్రతి నెల
ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంటారు. రేషన్ పంపిణీ చేసే రోజుల్లో లబ్ధిదారులు సుదూర ప్రాంతాలకు వెళ్లినా.. మరెక్కడైనా నివాసం ఉంటున్నా.. సరుకులు తీసుకునేందుకు స్వగ్రామానికి రావాల్సి వచ్చేది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇక నుంచి లబ్ధిదారులకు ఆ అవసరం ఉండదు.
అమలు ఇలా..
ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేయనున్న విధానంతో లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా సరుకులు సులువుగా తీసుకోవచ్చు. రేషన్ దుకాణానికి వెళ్లి కార్డు నంబర్ చెప్పి.. వేలిముద్ర వేసి బియ్యం తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల రేషన్ సరఫరా చేసే సమయంలో సొంత గ్రామంలోనే ఉండి సరుకులు తీసుకోవాల్సిన అవసరం ఇక ఉండదు. ఏ పని కోసమైనా ఇతర ప్రాంతాలకు వెళ్లినా.. ఇంట్లో వాళ్లు ఎక్కడికి వెళ్లినా రేషన్ తీసుకోవడం కుదరకపోవడంతో ఆ నెల రేషన్‌ను నష్టపోవాల్సిన పరిస్థితి ఉండదు.
దీనికి సంబంధించి జిల్లా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాకు ఎంత మేరకు రేషన్ సరుకులు సరఫరా చేయాలో ఆ మేరకే రేషన్ షాపులకు పంపిస్తారు. ఇతర దుకాణాలకు చెందిన లబ్ధిదారులు సరుకులు తీసుకున్న సమయంలో రేషన్ తగ్గినప్పుడు పౌర సరఫరాల శాఖ తగ్గిన మేరకు రేషన్‌ను మళ్లీ సరఫరా చేస్తుంది. ఆన్‌లైన్ ద్వారా నమోదైన లెక్కల ప్రకారం లబ్ధిదారుడికి సంబంధించిన రేషన్ షాపు నుంచి ఆ బియ్యం, ఇతర వస్తువులను పంపిస్తారు. ఈ విధానాన్ని ఈ నెల నుంచి జిల్లాలో అమలు చేయనుండటంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
మే నుంచి రాష్ట్రవ్యాప్తంగా..
జిల్లాలో ఈనెల నుంచి పోర్టబులిటీ విధానం అమలవుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మే నెల నుంచి అమలయ్యే అవకాశం ఉంది. మార్చి నెలలో లబ్ధిదారులు జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా బియ్యం, సరుకులు తీసుకునే వీలుంటుంది. ఇక మే నెల నుంచి ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యేందుకు పౌరసరఫ«రాల శాఖ చర్యలు చేపట్టింది. దీంతో అప్పుడు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు తీసుకునే వీలు కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment