తీరనున్న విద్యార్థుల వెతలు
– రూ. 2.25 కోట్లతో పూరత్యిన జూనియర్ కళాశాల నిర్మాణం
– మౌలిక వసతుల కల్పన
– నేడు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభం
నకిరేకల్
ఏడేళ్లుగా కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. అద్దె భవనాల్లో, అరకొర వసతుల మధ్య.. చెట్ల కింద విద్యాభ్యాసం చేస్తూ కాలం వెళ్లదీశారు.. ఎన్నో పోరాటాలకు ప్రభుత్వం స్పందించింది.. విశాల మైదానంలో రూ. 2.25 కోట్లతో జూనియర్ కాలేజీకి పక్కా భవనాన్ని నిర్మించింది. మెరుగైన వసతులు కల్పించి కాలేజీని తీర్చిదిద్దింది. బుధవారం ఈ కాలేజీని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభం కానుంది.
2009లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నకిరేకల్ పట్టణానికి జూనియర్ కళాశాలను మంజూరు చేశారు.
కాలేజీ మంజూరు కావడంతో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆనాడు తాత్కాలిక ఏర్పాట్ల మధ్య తరగతులను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు పక్కా భవనం నిర్మించక పోవడంతో అటు పాఠశాల విద్యార్థులు అరకొర వసతులు, చెట్ల కింద విద్యాభ్యాసం సాగించారు. ఈ కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌లలో మొత్తం 360మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు విద్యార్థులు రాక మూతపడిన చరిత్ర కూడా ఉంది. అయితే నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మాత్రం అందుకు భిన్నంగా సౌకర్యాలు లేకున్నా పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలను ఆదరించారు.
ఎమ్మెల్యే చొరవతో..
స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేషం ప్రత్యేకచొరవతో నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ పక్కా భవన నిర్మాణానికి 2014 ఆగస్టులో ప్రభుత్వం నూ.2.25కోట్లు నిధులు మంజూరు చేసింది.ఈ కళాశాల భవన నిర్మాణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఏడేళ్లుగాఅరకొర వసతులతో సతమతమవుతున్న విద్యార్థుల కోసం జూనియర్ కళాశాలకు పక్కా భవన నిర్మాణానికి గత ఏడాది 2015 ఆగస్టు 26 వతేదీన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి,æ ఎమ్మెల్యే వేముల వీరేషంలు స్థానిక ఆర్టీసీ బస్డాండ్ వెనుక ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి అన్సి సౌకర్యాలతో మొత్తం 14 గదులను నిర్మించారు. వీటిలోనే ల్యాబులు, విద్యార్థుల వెయింటింగ్ హాల్‌ను కూడా నిర్మించారు.