male buffalo
-
‘దున్నపోతు’ సమస్యకు పరిష్కారం.. ఏంటా కథ.. అసలేం జరిగింది?
కణేకల్లు(అనంతపురం జిల్లా): తీవ్ర ఉత్కంఠకు తెరలేపిన అమ్మవారి దున్నపోతు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. అందుబాటులో ఉన్న ఒకేఒక దున్నపోతుతో అంబాపురం, రచ్చుమర్రి గ్రామస్తులు ఊరి దేవర జరుపుకునేందుకు సిద్ధమైన నేపథ్యం తెలిసిందే. ఈ క్రమంలో దున్నపోతు తమదంటే తమదంటూ ఇరు గ్రామాల ప్రజలు వాగ్వాదానికి దిగి 20 రోజులుగా ఉత్కంఠకు తెరలేపారు. అసలేం జరిగిందంటే... ఈ నెల 17న అంబాపురంలో దేవర నిర్వహించాలని గ్రామస్తులు నిశ్చయించిన నేపథ్యంలో అమ్మవారి పేరుతో వదిలిన దున్నపోతు కోసం దాదాపు 30 రోజులకు పైగా వివిధ ప్రాంతాల్లో గాలించి చివరకు బొమ్మనహాళ్ మండలంలో కనిపించిన దేవరపోతును తీసుకెళ్లి బంధించారు. ఈ విషయం తెలుసుకున్న రచ్చుమర్రి గ్రామస్తులు అంబాపురానికి వెళ్లి తమ గ్రామ దేవత పేరున వదిలిన దున్నపోతును ఎలా బంధిస్తారంటూ వాదనకు దిగారు. అప్పటి నుంచి ఈ రెండు గ్రామాల మధ్య దున్నపోతు పంచాయితీ నలుగుతూ వస్తోంది ఎటూ తేల్చని పంచాయితీ.. ఇరు గ్రామాల ప్రజలను బుధవారం కణేకల్లు పోలీస్ స్టేషన్‌కు సీఐ యుగంధర్ పిలిపించుకుని మాట్లాడారు. ఒక్కొ గ్రామం నుంచి 80 నుంచి 90 మంది ప్రజలు తరలిరావడంతో పోలీస్ స్టేషన్ కిటకిటలాడింది. దున్నపోతును వదులుకునేది లేదంటూ అంబాపురం వాసులు వివరించారు. అయితే తమ గ్రామ దేవతకు సంబంధించిన దున్నపోతును తామూ వదులుకోబోమని రచ్చుమర్రి వాసులు తేల్చి చెప్పారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పంచాయితీ... మధ్యాహ్నం 1 గంట వరకూ సాగింది. సమస్యకు పరిష్కారం దక్కకపోవడంతో ఇరువైపులా ఐదుగురు చొప్పున గ్రామ పెద్దలను స్టేషన్ లోపలకు పిలుచుకెళ్లి సీఐ చర్చించారు. అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. అనంతరం ఎవరికి వారు ఆ దున్నపోతు తమదంటే తమదంటూ దేవుడిపై ప్రమాణాలు చేశారు. చివరకు టాస్ వేసి తుది నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. అయితే టాస్ వేస్తే తమకు అన్యాయం జరుగుతుందనే ఆందోళన ఇరు గ్రామాల ప్రజల్లో తలెత్తి చివరకు ఈ అంశాన్ని కూడా విరమించుకున్నారు. సెంటిమెంట్‌తో రాజీ కుదిర్చిన సీఐ.. చివరగా సీఐ యుగంధర్ ఇరు గ్రామాల పెద్దలను కూర్చొబెట్టి చర్చలు జరిపారు. ఈ నెల 17న అంబాపురంలో దేవర ఉందని, రచ్చుమర్రిలో దేవరకు ఇంకా ఏడాది గడువు ఉండడంతో దున్నపోతు కొనుగోలుకు అంబాపురం వాసులతో డబ్బిప్పిస్తానన్నారు. ఇది దైవ కార్యం కావడంతో అందరికీ మంచి జరుగుతుందని, మరో ఏడు రోజుల్లో ఊరి దేవర ఉండడంతో మంచి మనసుతో ఆలోచించి అంబాపురం వాసులకు సహకరించాలని, దీంతో అమ్మవారు కూడా శాంతిస్తారని సీఐ నచ్చచెప్పారు. చదవండి: వీడిన మిస్టరీ.. కూతురు వల్లే ఇలా జరిగిందా? సీఐ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రం రచ్చుమర్రి వాసులను ఆలోచనలో పడేసింది. చివరకు అంబాపురంలో దేవర ముగిసిన తర్వాత ఓ దున్నపోతును కొనిస్తామంటూ ఆ గ్రామస్తులు భరోసానివ్వడంతో ఇరు గ్రామాల మధ్య రాజీ కుదిరింది. ఎట్టకేలకు దున్నపోతు సమస్యకు పరిష్కారం దక్కడంతో అంబాపురం వాసులు హర్షం వ్యక్తం చేశారు. -
స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు
-
సదర్ ఉత్సవాలు: స్కూటితో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు
సాక్షి, హైదరాబాద్: సదర్ ఉత్సవాలకు సిద్ధమవుతున్న భాగ్యనగరంలో విషాదం చోటు చేసుకుంది. దున్నపోతు హల్చల్ చేసింది. రోడ్డుమీదకు వచ్చిన దున్నపోతు కనిపించిన వారిని కనిపించినట్లు కుమ్మేయసాగింది. ఆ వివరాలు.. (చదవండి: గాంధీభవన్‌లో ‘సదర్’ వేడుకలు) ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీదకు వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. దానికి ఎదురుగా కనిపించిన వారి మీదకు పరిగెత్తింది. దున్నపోతును కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. ఈ క్రమంలో దున్నపోతు స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చివరకు కొందరు యువకులు ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతును పట్టుకున్నారు. చదవండి: ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి.. -
రూ.7 కోట్ల యువరాజుకి జ్వరమొచ్చింది
హైదరాబాద్ : సదర్ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 'యువరాజ్' దున్నపోతుకు జ్వరమొచ్చింది. మార్కెట్లో ఈ దున్నపోతు విలువ రూ.7 కోట్లు. హైదరాబాద్ నగరంలోని యాదవులందరూ కలసి చేసుకొనే సదర్ పండుగలో దున్నపోతుల ప్రదర్శన నిమిత్తం... హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ‘యువరాజ్’ను రెండు రోజుల కిందట నగరానికి తరలించారు. ఇందుకు దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు, 6 రోజుల సమయం పట్టింది. 1600 కిలోల బరువు, 6 అడుగుల ఎత్తు... 14 అడుగుల పొడవు... అచ్చమైన రాచఠీవీని ఒలకబోసే ఈ యువరాజుకు ఆకలేస్తే రోజుకు 15 కేజీల యాపిల్స్, బాదం పిస్తాలు... కాదంటే కాజూలు తినడమే. హర్యానా ‘యువరాజ్’కు భారత్‌లోనే కాదు... విదేశాల్లోనూ బాగా ప్రసిద్ధి. 2007లో పుట్టిన ఈ దున్న ఇప్పటి వరకు ఎన్నో దూడలకు జన్మనిచ్చింది. దీని వీర్యం కోసం యూరోపియన్ దేశాల్లో ఎంతో డిమాండ్. ఈ దున్నకు రోజూ గడ్డి, దాణాతో పాటు పాలు, బాదం, పిస్తా, కాజు, బెల్లం, క్యారెట్ వంటి ఖరీదైన ఆహారం అందజేస్తామని దాని యజమాని కరమ్‌వీర్‌సింగ్ తెలిపారు. ఇందుకు రోజుకు రూ.5 వేలు ఖర్చవుతుందన్నారు. ఇప్పటి వరకు పంజాబ్, హర్యానాలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన అఖిల భారత పోటీల్లో గెలిచి 12 సార్లు చాంపియన్‌గా నిలిచింది. -
7 కోట్ల ‘యువరాజు’
- సదర్ ఆకర్షణగా హరియాణా దున్న నగరంలో రేపటి నుంచి రెండ్రోజుల సంబరం అమావాస్య నాడు వెన్నెల కురిపించే దీపావళిలో టపాసుల్లా... ఆ మరునాడు మహానగరంలో జరుపుకొనే ‘సదర్’ సంబరంలో ‘హర్యానా యువరాజ్’ మెరుపులు మురిపించనున్నాయి. 1600 కిలోల బరువు, 6 అడుగుల ఎత్తు... 14 అడుగుల పొడవు... అచ్చమైన రాచఠీవీని ఒలకబోసే ఈ ‘యువరాజావారిని’ నగరానికి రప్పించడానికే అక్షరాలా మూడు లక్షల రూపాయలు ఖర్చయిందంటే ఇక ‘ప్రత్యేకతలు’ ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు! ఆకలేస్తే బాదం పిస్తాలు... కాదంటే కాజూలు. మగమహారాజులా సకల సౌకర్యాలనూ అనుభవిస్తున్న ముర్రా జాతికి చెందిన ఈ దున్నపోతుకు అడుగు పెట్టిన చోటల్లా అవార్డే! గురు, శుక్రవారాల్లో నగరంలోని అమీర్‌పేట, నారాయణగూడ, శివార్లలో జరిగే ‘సదర్ సమ్మేళనం’లో తన సొగ‘సిరులు’ చూపి సమ్మోహితులను చేసేందుకు సిద్ధమైంది. - సాక్షి, హైదరాబాద్ నగరంలోని యాదవులందరూ కలసి చేసుకొనే ఈ పండుగలో దున్నపోతుల ప్రదర్శన దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. ఈసారి సంబరాలకు ప్రత్యేక ఆకర్షణ కానుంది హర్యానా ‘యువరాజ్’ దున్నపోతు. ఈ దున్నపోతు విలువ రూ.7 కోట్లు! ఇప్పటి వరకు ప్రదర్శించిన దున్నలు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖరీదు చేసేవే. హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ‘యువరాజ్’ను రెండు రోజుల కిందట నగరానికి తరలించారు. ఇందుకు దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు, 6 రోజుల సమయం పట్టిందని చెప్పారు ‘అఖిల భారత యాదవ సంఘం’ ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్. పదిమంది పనివారు దీన్ని కంటికి రెప్పలా చూసుకొంటారన్నారు. గురువారం అమీర్‌పేట్‌లో, శుక్రవారం నారాయణగూడ వైఎంసీఏ వద్ద జరుగనున్న ఉత్సవాల్లో ‘యువరాజ్’ను ప్రదర్శిస్తారు. రూ. కోటికి పైగా ఆదాయం... హర్యానా ‘యువరాజ్’కు భారత్‌లోనే కాదు... విదేశాల్లోనూ బాగా ప్రసిద్ధి. 2007లో పుట్టిన ఈ దున్న ఇప్పటి వరకు ఎన్నో దూడలకు జన్మనిచ్చింది. దీని వీర్యం కోసం యూరోపియన్ దేశాల్లో ఎంతో డిమాండ్. టర్కీ, స్కాట్లాండ్, బ్రెజిల్ వంటి దేశాలకు సైతం దీన్ని ఎగుమతి చేస్తున్నారు. నాలుగు రోజులకు ఒకసారి దీని నుంచి వీర్యాన్ని సేకరిస్తారు. అలా సేకరించిన వీర్యాన్ని నైట్రోజన్ సిలిండర్లలో భద్రపరిచి ఇంజెక్షన్ల రూపంలో విక్రయిస్తారు. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ.400. ఒక్కసారి విడుదలయ్యే వీర్యంపైన రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు వస్తుంది. ఇలా ఏటా కొన్ని వందల ఇంజెక్షన్లను విక్రయిస్తున్నారు. దీనిపైనే ఏటా రూ.కోటి వరకు ఆదాయం లభిస్తోంది! 12 సార్లు చాంపియన్! ఈ దున్నకు రోజూ గడ్డి, దానతో పాటు పాలు, బాదం, పిస్తా, కాజు, బెల్లం, క్యారెట్ వంటి ఖరీదైన ఆహారం అందజేస్తున్నట్లు చెప్పారు దాని యజమాని కరమ్‌వీర్‌సింగ్. ఇందుకు రోజుకు రూ.5 వేలు ఖర్చవుతుందన్నారు. ఇప్పటి వరకు పంజాబ్, హర్యానాలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన అఖిల భారత పోటీల్లో గెలిచి 12 సార్లు చాంపియన్‌గా నిలిచిన ‘యువరాజ్’ ఈ ఏడాది హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో సైతం అవార్డు కోసం పోటీకి సై అంటోంది. నగరం సన్నద్ధం... ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భాగ్యనగర్ సదర్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. బలమైన, కండపుష్టి కలిగిన దున్నలను ప్రదర్శన కోసం సిద్ధం చేస్తున్నారు. రకరకాల నూనెలతో మర్దన చేస్తున్నారు. ఈ ఏడాది వందకు పైగా దున్నలు ప్రదర్శనల్లో విన్యాసాలతో ఆకట్టుకోనున్నాయి.