7 కోట్ల ‘యువరాజు’ | cost of male buffalo yuvraju is about 7 crores | Sakshi
Sakshi News home page

7 కోట్ల ‘యువరాజు’

Published Wed, Nov 11 2015 6:30 AM | Last Updated on Mon, May 28 2018 2:02 PM

7 కోట్ల ‘యువరాజు’ - Sakshi

7 కోట్ల ‘యువరాజు’

- సదర్ ఆకర్షణగా హరియాణా దున్న  నగరంలో రేపటి నుంచి రెండ్రోజుల సంబరం

 

అమావాస్య నాడు వెన్నెల కురిపించే దీపావళిలో టపాసుల్లా... ఆ మరునాడు మహానగరంలో జరుపుకొనే ‘సదర్’ సంబరంలో ‘హర్యానా యువరాజ్’ మెరుపులు మురిపించనున్నాయి. 1600 కిలోల బరువు, 6 అడుగుల ఎత్తు... 14 అడుగుల పొడవు... అచ్చమైన రాచఠీవీని ఒలకబోసే ఈ ‘యువరాజావారిని’ నగరానికి రప్పించడానికే అక్షరాలా మూడు లక్షల రూపాయలు ఖర్చయిందంటే ఇక ‘ప్రత్యేకతలు’ ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు! ఆకలేస్తే బాదం పిస్తాలు... కాదంటే కాజూలు. మగమహారాజులా సకల సౌకర్యాలనూ అనుభవిస్తున్న ముర్రా జాతికి చెందిన ఈ దున్నపోతుకు అడుగు పెట్టిన చోటల్లా అవార్డే! గురు, శుక్రవారాల్లో నగరంలోని అమీర్‌పేట, నారాయణగూడ, శివార్లలో జరిగే ‘సదర్ సమ్మేళనం’లో తన సొగ‘సిరులు’ చూపి సమ్మోహితులను చేసేందుకు సిద్ధమైంది. - సాక్షి, హైదరాబాద్

 

నగరంలోని యాదవులందరూ కలసి చేసుకొనే ఈ పండుగలో దున్నపోతుల ప్రదర్శన దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. ఈసారి  సంబరాలకు ప్రత్యేక ఆకర్షణ కానుంది హర్యానా ‘యువరాజ్’ దున్నపోతు. ఈ దున్నపోతు విలువ రూ.7 కోట్లు! ఇప్పటి వరకు ప్రదర్శించిన దున్నలు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖరీదు చేసేవే. హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ‘యువరాజ్’ను రెండు రోజుల కిందట నగరానికి తరలించారు. ఇందుకు దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చు, 6 రోజుల సమయం పట్టిందని చెప్పారు ‘అఖిల భారత యాదవ సంఘం’ ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్. పదిమంది పనివారు దీన్ని కంటికి రెప్పలా చూసుకొంటారన్నారు. గురువారం అమీర్‌పేట్‌లో, శుక్రవారం నారాయణగూడ వైఎంసీఏ వద్ద జరుగనున్న ఉత్సవాల్లో ‘యువరాజ్’ను ప్రదర్శిస్తారు.

 

రూ. కోటికి పైగా ఆదాయం...

హర్యానా ‘యువరాజ్’కు భారత్‌లోనే కాదు... విదేశాల్లోనూ బాగా ప్రసిద్ధి. 2007లో పుట్టిన ఈ దున్న ఇప్పటి వరకు ఎన్నో దూడలకు జన్మనిచ్చింది. దీని వీర్యం కోసం యూరోపియన్ దేశాల్లో ఎంతో డిమాండ్. టర్కీ, స్కాట్లాండ్, బ్రెజిల్ వంటి దేశాలకు సైతం దీన్ని ఎగుమతి చేస్తున్నారు. నాలుగు రోజులకు ఒకసారి దీని నుంచి వీర్యాన్ని సేకరిస్తారు. అలా సేకరించిన వీర్యాన్ని నైట్రోజన్ సిలిండర్లలో భద్రపరిచి ఇంజెక్షన్‌ల రూపంలో విక్రయిస్తారు. ఒక్కో ఇంజెక్షన్ ఖరీదు రూ.400. ఒక్కసారి విడుదలయ్యే వీర్యంపైన రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు వస్తుంది. ఇలా ఏటా కొన్ని వందల ఇంజెక్షన్లను విక్రయిస్తున్నారు. దీనిపైనే ఏటా రూ.కోటి వరకు ఆదాయం లభిస్తోంది!

 

12 సార్లు చాంపియన్!

ఈ దున్నకు రోజూ గడ్డి, దానతో పాటు పాలు, బాదం, పిస్తా, కాజు, బెల్లం, క్యారెట్ వంటి ఖరీదైన ఆహారం అందజేస్తున్నట్లు చెప్పారు దాని యజమాని కరమ్‌వీర్‌సింగ్. ఇందుకు రోజుకు రూ.5 వేలు ఖర్చవుతుందన్నారు. ఇప్పటి వరకు పంజాబ్, హర్యానాలతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నిర్వహించిన అఖిల భారత పోటీల్లో గెలిచి 12 సార్లు చాంపియన్‌గా నిలిచిన ‘యువరాజ్’ ఈ ఏడాది హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో సైతం అవార్డు కోసం పోటీకి సై అంటోంది.

 

నగరం సన్నద్ధం...

ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భాగ్యనగర్ సదర్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. బలమైన, కండపుష్టి కలిగిన దున్నలను ప్రదర్శన కోసం సిద్ధం చేస్తున్నారు. రకరకాల నూనెలతో మర్దన చేస్తున్నారు. ఈ ఏడాది వందకు పైగా దున్నలు ప్రదర్శనల్లో విన్యాసాలతో ఆకట్టుకోనున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement