
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు.. ఈ ఘటనలో దంపతులతో పాటు మరో యువతి తీవ్రంగా గాయపడింది. మద్యం, వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పారిశ్రామిక వాడలోని శ్రీనిధి నల్ల బండల పాలిష్ పరిశ్రమలో నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి పరిశ్రమ ఆవరణలో మంచంపై నిద్రిస్తున్నారు. అదే ఫ్యాక్టరీలో పని చేసే మల్లికార్జున కుమార్తె పూజిత కూడా వీరి పక్కనే మంచం వేసుకుని నిద్రిస్తోంది.
రాత్రి 11.30 గంటల సమయంలో సరస్వతి మరిది రామేశ్వర్‌రెడ్డి నిద్రిస్తున్న నల్లపురెడ్డి, సరస్వతిపై పెట్రోల్ పోశాడు. మెలకువ వచ్చిన సరస్వతి ఏం చేస్తున్నావురా అని అరిచేలోగానే నిప్పంటించాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే నిద్రిస్తున్న పూజితకు కూడా మంటలు అంటుకుని చేతులు కాలాయి. తాగుడుకు బానిసైన రామేశ్వర్‌రెడ్డిని రెండు రోజుల క్రితం తాము పద్ధతి మార్చుకోవాలని దండించామని, అది మనసులో ఉంచుకుని ఇలా చేశాడని నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు రూరల్ ఎస్‌ఐ గౌస్ మహ్మద్‌కు వివరించారు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ కేసు నమోదు చేసుకున్నారు. సరస్వతి, నల్లపురెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పూజితకు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment