Petrol poured
-
తాడిపత్రిలో దారుణం.. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి..
సాక్షి, అనంతపురం జిల్లా: తాడిపత్రిలో దారుణం జరిగింది. నిద్రిస్తున్న వారిపై పెట్రోలు పోసి నిప్పుపెట్టారు.. ఈ ఘటనలో దంపతులతో పాటు మరో యువతి తీవ్రంగా గాయపడింది. మద్యం, వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. పారిశ్రామిక వాడలోని శ్రీనిధి నల్ల బండల పాలిష్ పరిశ్రమలో నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి పరిశ్రమ ఆవరణలో మంచంపై నిద్రిస్తున్నారు. అదే ఫ్యాక్టరీలో పని చేసే మల్లికార్జున కుమార్తె పూజిత కూడా వీరి పక్కనే మంచం వేసుకుని నిద్రిస్తోంది. రాత్రి 11.30 గంటల సమయంలో సరస్వతి మరిది రామేశ్వర్‌రెడ్డి నిద్రిస్తున్న నల్లపురెడ్డి, సరస్వతిపై పెట్రోల్ పోశాడు. మెలకువ వచ్చిన సరస్వతి ఏం చేస్తున్నావురా అని అరిచేలోగానే నిప్పంటించాడు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే నిద్రిస్తున్న పూజితకు కూడా మంటలు అంటుకుని చేతులు కాలాయి. తాగుడుకు బానిసైన రామేశ్వర్‌రెడ్డిని రెండు రోజుల క్రితం తాము పద్ధతి మార్చుకోవాలని దండించామని, అది మనసులో ఉంచుకుని ఇలా చేశాడని నల్లపురెడ్డి, సరస్వతి దంపతులు రూరల్ ఎస్ఐ గౌస్ మహ్మద్‌కు వివరించారు. వారి ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ కేసు నమోదు చేసుకున్నారు. సరస్వతి, నల్లపురెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. పూజితకు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు.. -
తమిళనాడులో దారుణం..
సాక్షి, చెన్నై: పెళ్లికి నిరాకరించిందనే ఆగ్రహంతో ప్రియురాలిపై పెట్రోల్ పోసి ఓ ప్రేమోన్మాది తగల బెట్టాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే ఆ యువతి కన్నుమూసింది. వివరాలు.. తిరుప్పూరు జిల్లా పల్లడం సమీపంలోని పనపాళయం మార్గంలో మంటల్లో కాలుతూ బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఓ యువతి పరుగులు తీస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. మంటల్ని ఆర్పి ఆ యువతిని పల్లడం ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఈ ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో మోటారు సైకిల్ నుంచి కిందపడి గాయాలతో ఉన్న ఓ యువకుడిని గుర్తించి అతడిని కూడా హాస్పిటల్లో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో వెలుగు చూసిన దుశ్చర్య.. పోలీసుల ప్రాథమిక విచారణలో ఒకే చోట వేర్వేరు ఘటనలు జరగడం, చివరకు ఆ ఇద్దరు ప్రేమికులుగా నిర్ధారణ అయ్యింది. ఆ యువతిని ఉత్తరాదికి చెందిన పూజ(19)గా గుర్తించారు. రాయర్ పాళయంలో బంధువులతో ఉంటూ ఓ బనియన్ ఫ్యాక్టరీలో ఆమె పనిచేస్తున్నట్లు వెల్లడైంది. అదే ఫ్యాక్టరీలో రాయర్ పాళయంకు చెందిన గుణశేఖరన్ కుమారుడు లోకేష్ (22) కూడా పని చేస్తున్నాడు. ఈ ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్లు తేలింది. పెళ్లి చేసుకునేందుకు ఆ యువతి నిరాకరించడంతో పాటు తనను దూరం పెట్టడంతో లోకేష్ ఉన్మాదిగా మారాడు. బుధవారం సాయంత్రం మాట్లాడాలని పనపాళయంకు పిలిపించి, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి మోటారు సైకిల్‌పై తప్పించుకుని వెళ్లే సమయంలో లోకేష్ జారి కింద పడినట్లు విచారణలో తేలింది. ఇక స్థానికుల సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది పూజను మెరుగైన చికిత్స నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గురువారం ఉదయం చికిత్స ఫలించక ఆమె మరణించింది. ఈ సమాచారంతో మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. -
కాబోయే భర్తే కదా అని సహజీవనం చేసింది.. ఇంతలో..
సాక్షి, బెంగళూరు: వారిది ఐదేళ్ల క్రితం చిగురించిన ప్రేమకథ. కాలేజీలో మొదలైన ప్రేమతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తు బాగుండాలని పోటీపడి మరీ మచి ఉద్యోగం కూడా సంపాదించుకున్నారు. కాబోయే భర్తే కదా అని సహజీవనం కొనసాగించారు. ఇంతలో సీన్ రివర్స్ అయ్యింది. ప్రియుడే ఆమె పాలిట యముడయ్యాడు. పాపం అని కూడా చూడకుండా ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్డాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. విజయపుర ఇంజనీరింగ్ కాలేజీలో దానేశ్వరి(23), శివకుమార్ చంద్రశేఖర్ కలిసి చదువుకున్నారు. ఇంజనీరింగ్‌లోనే వారిద్దరూ ప్రేమించుకున్నారు. లైఫ్‌లో సెటిల్ అయ్యాక ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లిచేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లపాటు సహజీవనం కూడా చేశారు. కాలేజీ అయిపోయాక ఉద్యోగం సంపాదించి హ్యాపీగా సమయం గడిచిపోతుండగా.. ఓ రోజు దానేశ్వరి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో చంద్రశేఖర్ తన పేరెంట్స్‌లో మాట్లాడి ఒప్పిస్తానని చెప్పి ఇంటికి వెళ్లివచ్చాడు. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆమెకు వచ్చిరాగానే షాకింగ్ వార్త చెప్పాడు. కులాలు వేరైన కారణంగా పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేశాడు. దీంతో తనను ఒప్పించాలని దానేశ్వరి అతడి ఆఫీసుకు వెళ్లి ప్రాధేయపడింది. కానీ, అతను మాత్రం ఒప్పుకోలేదు. ఇక, ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ చేసిన శివకుమార్.. దానేశ్వరితో మాట్లాడాలని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో బాధపడుతున్న దానేశ్వరి అతడే ఆస్పత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దానేశ్వరి మృతి చెందింది. కాగా, యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
వైఎస్ఆర్సీపీ నాయకుడి ఐరన్‌మార్టుకు నిప్పు
బనగానపల్లెటౌన్: పట్టణంలోని వైఎస్ఆర్సీపీ నాయకుడు, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఫైజ్‌కు చెందిన ఐరన్ మార్టుకు శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియన వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పుంటించారు. వెంటనే స్థానికులు, రాత్రి బీట్‌లో ఉన్న పోలీసులు గమనించడంతో ఘోరఅగ్ని ప్రమాదం తప్పింది. బాధితుడి సోదరుడు ఖైజ్ శనివారం తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కేడీసీసీ బ్యాంకు సమీపంలో ఉన్న ఫయాజ్ ఐరన్ మార్టు దుకాణంలోని గ్రౌండ్ ఫ్లోర్లో అర్ధరాత్రి షెట్ట్టర్ కింద పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి పరారు అయ్యారు. మంటలు వ్యాపించడంతో గమనించిన స్థానికులు, రాత్రి పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు వెంటనే అదుపులోనికి తెచ్చారు. ఈ సంఘటనలో చిన్న పైప్‌లు, గొట్టలు కాలిపోయాయి. పెద్దగా ఆస్తి నష్టం జరగా లేదు. సంఘటన స్థలాన్ని సాయంత్రం కర్నూలు నుంచి వచ్చిన డ్వాగ్ స్క్వాడ్ బృందం పరిశీలించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మంజునాథ్ పేర్కొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి: కాటసాని వైఎస్ఆర్సీపీ నాయకుడు ఫైజ్‌కు చెందిన ఐరన్ మార్టుకు నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోలీసు ఉన్నతాధికారులను కోరారు. అగ్నిప్రమాద సంఘటన స్థలాన్ని కాటసాని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుతో మాట్లాడుతూ 2000 సంవత్సరంలో కూడ బనగానపల్లె పట్టణంలో వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేసేందుకు కొదరు నాయకులు ఇటువంటి సంఘటలకే పాల్పడ్డారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి సంఘటలు పునరావృతం చేసేందుకు అసాంఘీక శక్తులు ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్న బనగానపల్లె పట్టణంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని రామిరెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద వెంకటరెడ్డి, డాక్టర్ మహమ్మద్‌హుస్సేన్, న్యాయవాది ఖైర్, ఎవరెస్టు బాబు, ఆచారి, ఖానిక్, బాబులాల్, సురేష్‌కుమార్, తదితరులు ఉన్నారు.