
సాక్షి, చెన్నై: పెళ్లికి నిరాకరించిందనే ఆగ్రహంతో ప్రియురాలిపై పెట్రోల్ పోసి ఓ ప్రేమోన్మాది తగల బెట్టాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే ఆ యువతి కన్నుమూసింది. వివరాలు.. తిరుప్పూరు జిల్లా పల్లడం సమీపంలోని పనపాళయం మార్గంలో మంటల్లో కాలుతూ బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఓ యువతి పరుగులు తీస్తుండడాన్ని స్థానికులు గుర్తించారు. మంటల్ని ఆర్పి ఆ యువతిని పల్లడం ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఈ ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో మోటారు సైకిల్ నుంచి కిందపడి గాయాలతో ఉన్న ఓ యువకుడిని గుర్తించి అతడిని కూడా హాస్పిటల్‌లో చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
విచారణలో వెలుగు చూసిన దుశ్చర్య..
పోలీసుల ప్రాథమిక విచారణలో ఒకే చోట వేర్వేరు ఘటనలు జరగడం, చివరకు ఆ ఇద్దరు ప్రేమికులుగా నిర్ధారణ అయ్యింది. ఆ యువతిని ఉత్తరాదికి చెందిన పూజ(19)గా గుర్తించారు. రాయర్ పాళయంలో బంధువులతో ఉంటూ ఓ బనియన్ ఫ్యాక్టరీలో ఆమె పనిచేస్తున్నట్లు వెల్లడైంది. అదే ఫ్యాక్టరీలో రాయర్ పాళయంకు చెందిన గుణశేఖరన్ కుమారుడు లోకేష్ (22) కూడా పని చేస్తున్నాడు. ఈ ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నట్లు తేలింది. పెళ్లి చేసుకునేందుకు ఆ యువతి నిరాకరించడంతో పాటు తనను దూరం పెట్టడంతో లోకేష్ ఉన్మాదిగా మారాడు.
బుధవారం సాయంత్రం మాట్లాడాలని పనపాళయంకు పిలిపించి, తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి మోటారు సైకిల్‌పై తప్పించుకుని వెళ్లే సమయంలో లోకేష్ జారి కింద పడినట్లు విచారణలో తేలింది. ఇక స్థానికుల సమాచారంతో అంబులెన్స్ సిబ్బంది పూజను మెరుగైన చికిత్స నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గురువారం ఉదయం చికిత్స ఫలించక ఆమె మరణించింది. ఈ సమాచారంతో మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లోకేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment