సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికారంలో ఉన్నన్నాళ్లూ హడావుడి చేసిన టీడీపీ నేతలు పత్తాలేకుండా పోయారు. ఎన్నికల వేళ కిందిస్థాయి కార్యకర్తలను ఉసిగొలిపి రచ్చ చేసిన వారంతా ఓటమి తర్వాత తలోదారి చూసుకున్నారు. చుట్టపుచూపుగా కూడా నియోజకవర్గాల్లో కనిపించకపోవడంతో కేడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మళ్లీ ఎన్నికల వేళ వచ్చి మాయమాటలు చెప్పాలని చూసినా ఇక వారిని నమ్మకూడదని కార్యకర్తలు నిర్ణయం తీసేసుకున్నారు.
కొందరు నాయకులు అధికారం కోసమే రాజకీయం చేస్తారు. ఫలితం తిరగబడితే చాపచుట్టేస్తారు. నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచి తాము మాత్రం హాయిగా ఉండిపోతారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలో టీడీపీ నాయకులు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఊరూరూ తిరిగిన నేతలు ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. కనీసం నెలకోసారి వచ్చి కార్యకర్తలనైనా పలకరించే పరిస్థితి లేదు. దీంతో కేడర్ కూడా తలోదారి చూసుకుంటోంది.
ఏమప్పో.. ఇట్ల ‘జేస్తి’రి!
35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తనయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు జేసీ దివాకర్‌రెడ్డి. 2019లో అనంతపురం పార్లమెంటుకు బరిలోకి దిగిన జేసీ కుమారుడు... పవన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో తెలియదు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉండే పవన్.. ఎన్నికలైనప్పటి నుంచి అనంతపురం జిల్లాకు వచ్చిన దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లోగానీ, సమావేశాల్లోగానీ ఎప్పుడూ పాల్గొనలేదు. తాడిపత్రి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ తమ్ముడు అస్మిత్‌రెడ్డి కూడా అప్పుడప్పుడు తాడిపత్రికి వచ్చి పోతున్నారు. యువ నేతలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నికలప్పుడు వారి వెంటే తిరిగిన తాడిపత్రి ‘తమ్ముళ్లు’ ఏందప్పా ఇట్ల జేస్తిరి అంటూ నిట్టూరుస్తున్నారు.
వలసపోయినా.. కానరాని ‘వరద’
టీడీపీ హయాంలో ఎప్పుడూ గన్‌మెన్లు, మందీమార్బలంతో కనిపించిన వారెవరంటే టక్కున గుర్తించేవారు వరదాపురం సూరి. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. కొన్నాళ్లకే అన్నీ సర్దుకుని బీజేపీలోకి వలసపోయారు. తీవ్రమైన భూ ఆక్రమణల ఆరోపణలున్న నేపథ్యంలో ఆయా కేసుల నుంచి తప్పించుకునేందుకే వలస రాగం అందుకున్నారని విమర్శలున్నాయి.
బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక పోనీ.. ఆ పార్టీ నాయకులకైనా అందుబాటులో ఉంటున్నారంటే అదీ లేదు. అయితే, 2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ తరఫున పోటీ చేయాలని చూస్తుండగా.. అదే పార్టీకి చెందిన పరిటాల శ్రీరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. వరదాపురంసూరికి సన్నిహితంగా ఉన్న వారు సైతం ఏ కండువా వేసుకోవాలో తెలియక ఆయనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అంటీముట్టనట్టుగా.. నిమ్మల కిష్టప్ప
2019లో హిందూపురం పార్లమెంటు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నిమ్మల కిష్టప్ప రాజకీయాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కార్యకర్తల సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. సామాజిక వర్గ సమీకరణలనే నమ్ముకున్న ఆయనకు, 2024లో టికెట్ ఇస్తారో లేదోనన్న అనుమానాలూ ఉన్నాయి.
చుట్టపు చూపుగా బాలయ్యా
హిందూపురం నియోజకవర్గ వాసులు 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ బాలకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపారు. కానీ ఆయన చుట్టపు చూపుగా ఆరుమాసాలకోసారి కూడా నియోజకవర్గానికి రావడం లేదన్న విమర్శలున్నాయి. గతంలో ఆయన పీఏనే మొత్తం చూసుకునేవారు. ఆ పీఏ కూడా ఇటీవలే పేకాట ఆడుతూ పోలీసులకు దొరికాడు. దీంతో అతన్ని తీసేశారు. దీంతో అసలు బాలకృష్ణ ఎప్పుడొస్తారన్న విషయం నియోజక వర్గ ప్రజలకు కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వారిని ఇంకోసారి నమ్ముకోవద్దని అటు టీడీపీ కేడర్‌తో పాటు జనం కూడా నిర్ణయించుకున్నారు. అందువల్లే బాలయ్య ఎప్పుడోకసారి వచ్చినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఉనికి పాట్లలో కొందరు..
పరాజయం పాలయ్యాక కొందరు టీడీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏళ్లుగా విశ్రాంతి తీసుకుంటూ హాయిగా గడిపేస్తున్నారు. ఎన్నికల వేళ హడావుడి చేసిన నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడలేదు. అప్పుడప్పుడూ చుట్టపుచూపుగా వచ్చేవారు మాత్రం ‘ఉనికి’ చాటుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు వంటి వారు గిమ్మిక్కులు చేస్తూ పత్రికలకెక్కుతున్నారు.
చదవండి: అన్నదమ్ముల అస్త్రసన్యాసం!
కానీ సొంత పార్టీ నేతలే వారి తీరును తప్పుపడుతున్నారు. ‘మంత్రులుగా ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు’ అన్నట్టు ఆ పార్టీ కార్యకర్తలే విమర్శిస్తుండడం ఇక్కడ కొసమెరుపు. అనంతపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్న ప్రభాకర్ చౌదరితో సహా చాలా మంది అసలు టికెట్ వస్తుందో రాదోనన్న అనుమానంతో దిక్కుతెలియని పరిస్థితిలో పడిపోయారు. దీంతో కేడర్ దిక్కులేక తలోదిక్కు చూసుకుంది. ఇక గుంతకల్లులో జితేందర్ గౌడ్ సైతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరనే విమర్శలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment