JC Pavan Reddy
-
టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
-
బాలయ్యా.. ఇటు రావేమయ్యా.. కిష్టప్ప.. ఎక్కడున్నావప్పా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికారంలో ఉన్నన్నాళ్లూ హడావుడి చేసిన టీడీపీ నేతలు పత్తాలేకుండా పోయారు. ఎన్నికల వేళ కిందిస్థాయి కార్యకర్తలను ఉసిగొలిపి రచ్చ చేసిన వారంతా ఓటమి తర్వాత తలోదారి చూసుకున్నారు. చుట్టపుచూపుగా కూడా నియోజకవర్గాల్లో కనిపించకపోవడంతో కేడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మళ్లీ ఎన్నికల వేళ వచ్చి మాయమాటలు చెప్పాలని చూసినా ఇక వారిని నమ్మకూడదని కార్యకర్తలు నిర్ణయం తీసేసుకున్నారు. కొందరు నాయకులు అధికారం కోసమే రాజకీయం చేస్తారు. ఫలితం తిరగబడితే చాపచుట్టేస్తారు. నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచి తాము మాత్రం హాయిగా ఉండిపోతారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలో టీడీపీ నాయకులు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఊరూరూ తిరిగిన నేతలు ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. కనీసం నెలకోసారి వచ్చి కార్యకర్తలనైనా పలకరించే పరిస్థితి లేదు. దీంతో కేడర్ కూడా తలోదారి చూసుకుంటోంది. ఏమప్పో.. ఇట్ల ‘జేస్తి’రి! 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తనయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు జేసీ దివాకర్‌రెడ్డి. 2019లో అనంతపురం పార్లమెంటుకు బరిలోకి దిగిన జేసీ కుమారుడు... పవన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో తెలియదు. హైదరాబాద్‌లో స్థిర నివాసం ఉండే పవన్.. ఎన్నికలైనప్పటి నుంచి అనంతపురం జిల్లాకు వచ్చిన దాఖలాలు లేవు. పార్టీ కార్యక్రమాల్లోగానీ, సమావేశాల్లోగానీ ఎప్పుడూ పాల్గొనలేదు. తాడిపత్రి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ తమ్ముడు అస్మిత్‌రెడ్డి కూడా అప్పుడప్పుడు తాడిపత్రికి వచ్చి పోతున్నారు. యువ నేతలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నికలప్పుడు వారి వెంటే తిరిగిన తాడిపత్రి ‘తమ్ముళ్లు’ ఏందప్పా ఇట్ల జేస్తిరి అంటూ నిట్టూరుస్తున్నారు. వలసపోయినా.. కానరాని ‘వరద’ టీడీపీ హయాంలో ఎప్పుడూ గన్మెన్లు, మందీమార్బలంతో కనిపించిన వారెవరంటే టక్కున గుర్తించేవారు వరదాపురం సూరి. గత ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. కొన్నాళ్లకే అన్నీ సర్దుకుని బీజేపీలోకి వలసపోయారు. తీవ్రమైన భూ ఆక్రమణల ఆరోపణలున్న నేపథ్యంలో ఆయా కేసుల నుంచి తప్పించుకునేందుకే వలస రాగం అందుకున్నారని విమర్శలున్నాయి. బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక పోనీ.. ఆ పార్టీ నాయకులకైనా అందుబాటులో ఉంటున్నారంటే అదీ లేదు. అయితే, 2024 ఎన్నికల్లో తిరిగి టీడీపీ తరఫున పోటీ చేయాలని చూస్తుండగా.. అదే పార్టీకి చెందిన పరిటాల శ్రీరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. వరదాపురంసూరికి సన్నిహితంగా ఉన్న వారు సైతం ఏ కండువా వేసుకోవాలో తెలియక ఆయనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటీముట్టనట్టుగా.. నిమ్మల కిష్టప్ప 2019లో హిందూపురం పార్లమెంటు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నిమ్మల కిష్టప్ప రాజకీయాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కార్యకర్తల సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. సామాజిక వర్గ సమీకరణలనే నమ్ముకున్న ఆయనకు, 2024లో టికెట్ ఇస్తారో లేదోనన్న అనుమానాలూ ఉన్నాయి. చుట్టపు చూపుగా బాలయ్యా హిందూపురం నియోజకవర్గ వాసులు 2014, 2019 రెండు ఎన్నికల్లోనూ బాలకృష్ణను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపారు. కానీ ఆయన చుట్టపు చూపుగా ఆరుమాసాలకోసారి కూడా నియోజకవర్గానికి రావడం లేదన్న విమర్శలున్నాయి. గతంలో ఆయన పీఏనే మొత్తం చూసుకునేవారు. ఆ పీఏ కూడా ఇటీవలే పేకాట ఆడుతూ పోలీసులకు దొరికాడు. దీంతో అతన్ని తీసేశారు. దీంతో అసలు బాలకృష్ణ ఎప్పుడొస్తారన్న విషయం నియోజక వర్గ ప్రజలకు కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వారిని ఇంకోసారి నమ్ముకోవద్దని అటు టీడీపీ కేడర్‌తో పాటు జనం కూడా నిర్ణయించుకున్నారు. అందువల్లే బాలయ్య ఎప్పుడోకసారి వచ్చినా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఉనికి పాట్లలో కొందరు.. పరాజయం పాలయ్యాక కొందరు టీడీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏళ్లుగా విశ్రాంతి తీసుకుంటూ హాయిగా గడిపేస్తున్నారు. ఎన్నికల వేళ హడావుడి చేసిన నియోజకవర్గాల వైపు కన్నెత్తి చూడలేదు. అప్పుడప్పుడూ చుట్టపుచూపుగా వచ్చేవారు మాత్రం ‘ఉనికి’ చాటుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు వంటి వారు గిమ్మిక్కులు చేస్తూ పత్రికలకెక్కుతున్నారు. చదవండి: అన్నదమ్ముల అస్త్రసన్యాసం! కానీ సొంత పార్టీ నేతలే వారి తీరును తప్పుపడుతున్నారు. ‘మంత్రులుగా ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయారు.. ఇప్పుడేం చేస్తారు’ అన్నట్టు ఆ పార్టీ కార్యకర్తలే విమర్శిస్తుండడం ఇక్కడ కొసమెరుపు. అనంతపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకున్న ప్రభాకర్ చౌదరితో సహా చాలా మంది అసలు టికెట్ వస్తుందో రాదోనన్న అనుమానంతో దిక్కుతెలియని పరిస్థితిలో పడిపోయారు. దీంతో కేడర్ దిక్కులేక తలోదిక్కు చూసుకుంది. ఇక గుంతకల్లులో జితేందర్ గౌడ్ సైతం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరనే విమర్శలున్నాయి. -
జేసీ పవన్‌పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: జేసీ దివాకర్‌రెడ్డి తయుడు జేసీ పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆయనపై కేసునమోదు చేసినట్లు తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి విడుదల సందర్భంగా కోవిడ్ ఆంక్షలును ఉల్లంఘించి ర్యాలీ చేయొద్దని జేసీ పవన్‌కు తాడిపత్రి పోలీసులు ముందుగానే సూచించారు. అయిన్పటికీ పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ ర్యాలీ నిర్వహించి, బాణాసంచా కాల్చారు.అంతే కాకుండా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి సామాజిక దూరం పాటించకుండా వ్యవహరించడంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. (మళ్లీ జైలుకు జేసీ..) దళిత సీఐ దేవేంద్రను దూషించినందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అనంతరం జేసీ ప్రకర్‌రెడ్డిని కడప సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన జేసీపై మరో నాలుగు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మళ్లీ జైలుకు జేసీ..
తాడిపత్రి/కడప అర్బన్ /అనంతపురం క్రైం: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మళ్లీ జైలుపాలయ్యారు. తాడిపత్రి సీఐ దేవేంద్రను కులం పేరుతో దూషించడంతో పాటు కరోనా నిబంధనల ఉల్లంఘన, అధికారులకు బెదిరింపులకు సంబంధించి ఆయనపై తాడిపత్రి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటితో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జేసీ బెయిల్‌పై గురువారం విడుదలయ్యాక కడప కారాగారం వద్ద కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. దీంతో ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్కుమార్రెడ్డిలతోపాటు 31 మందిపై రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే జేసీ భారీ కాన్వాయ్‌తో తాడిపత్రి వస్తూ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సీఐ దేవేంద్రను కులం పేరుతో దూషించారు. దీంతో శుక్రవారం అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు సంతకాలు చేసేందుకు వచ్చిన జేసీని తాడిపత్రి డీఎస్పీ అరెస్ట్ చేశారు. గుత్తి మేజిస్ట్రేట్లో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం జేసీని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. -
నీ కుమారుడు ఎలా ఎంపీగా గెలుస్తారని అనుకుంటున్నావ్!
తెలుగుదేశం పార్టీలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఎదురుగాలి వీస్తోందా? తన కుమారుడిని రాజకీయంగా నిలపాలనుకున్న ఆశలు అడియాసలవుతున్నాయా? తాడిపత్రి మినహా మరెక్కడా జేసీ ఫ్యామిలీకి చోటు దక్కదా? టీడీపీలో తాజా పరిణామాలను బేరీజు వేస్తే ఔననే సమాధానం వస్తోంది. అనంతపురం ఎంపీ, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలు జేసీకి ముప్పు తెచ్చిపెట్టాయి. మైకు దొరికితే నోటికేదొస్తే అది ఇష్టానుసారం మాట్లాడే ఎంపీ దివాకర్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన షాక్‌తో నోట్లో పచ్చివెలక్కాయపడినట్లయింది. జేసీ ఫ్యామిలీకి తాడిపత్రి మినహా అనంతపురం ఎంపీ టిక్కెట్టు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారని టీడీపీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న చర్చ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: జేసీ దివాకర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 2014 వరకూ తాడిపత్రిలోనే సాగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ టీడీపీలో చేరారు. అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లలో తాడిపత్రి మినహా పార్లమెంట్ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండలేకపోయారు. అనంతపురం, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలను మార్చాలని సీఎం ముందు పలు సందర్భాల్లో ప్రతిపాదన పెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయదుర్గంలో కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మంత్రి కాలవతో విభేదించారు. అతనూ ‘దుర్గం’ టిక్కెట్ రేసులో ఉన్నారు. దీంతో కాలవ కూడా జేసీని వ్యతిరేకించే పరిస్థితి తలెత్తింది. ఒక్కమాటలో చెప్పాలంటే జేసీ ఒకవైపు.. తక్కిన ఎమ్మెల్యేలు మరోవైపు అన్నట్లు పరిస్థితి తయారైంది. ఈ రెండువర్గాలు పరస్పరం సీఎంకు ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. ఈ క్రమంలో జేసీ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డికి ఎంపీ టిక్కెట్టు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. మొదట్లో చంద్రబాబు దీనికి అంగీకరించినట్లే తెలుస్తోంది. కానీ పవన్‌ను ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించడం, తరచూ తనదైన శైలి వ్యాఖ్యలతో జేసీ పట్ల ప్రజల్లో చులకనభావం ఏర్పడటం, తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఆశ్రమ ఘటన.. వెరసి చంద్రబాబు కూడా ఆలోచనలో పడ్డట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. డోలాయమానంలో గురునాథ్, మధుసూదన్‌గుప్తా తాజా పరిణామాలతో జేసీ దివాకర్‌రెడ్డి డీలాపడ్డారు. జేసీ సిఫార్సుతో టీడీపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అక్కడ ఇమడలేని పరిస్థితి. అహుడా చైర్మన్ చేస్తామని హామీ ఇచ్చి తర్వాత చేయిచ్చారు. గురునాథరెడ్డి కూడా అనంతపురం వదిలి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. దీంతో గురునాథరెడ్డి వర్గం పూర్తిగా ఆ కుటుంబానికి దూరమైపోయింది. అహుడాపై గురునాథరెడ్డి సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి జేసీని కలిసి ఆరా తీస్తే ఇప్పుడు పరిస్థితి బాగోలేదని తన బాధన వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయంగా ఉనికి కోల్పోకూడదనుకుంటే టీడీపీని వీడి స్వతంత్రంగా బరిలోకి దిగాలని గురునాథరెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే రాజకీయంగా కనుమరుగు కావడం ఖాయమనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతోపాటు జేసీని నమ్మి మధుసూదన్‌గుప్తా కూడా టీడీపీకి చేరువయ్యారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇప్పిస్తాననే జేసీ హామీతో అమరావతి దాకా వెళ్లి వెనక్కి వచ్చిన గుప్తాకు ఇప్పటి వరకు టీడీపీలోకి ఎంట్రీ దొరకలేదు. దీనికి కారణం జేసీపై చంద్రబాబుకు నమ్మకం సన్నగల్లడమే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు దక్కకపోతే ఇతనూ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు గుప్తా వర్గీయులు చెబుతున్నారు. ఈ పరిణామాలు బేరీజు వేస్తే జేసీతో పాటు ఆయన వర్గానికి టీడీపీలో పూర్తిగా ప్రాధాన్యం లేదని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో జేసీపై తాము పైచేయి సాధించామని టీడీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. అయితే ఎన్నికల వాతావరణం మొదలైన నేపథ్యంలో మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో వేచి చూడాల్సిందే. తాడిపత్రి టిక్కెట్టు మాత్రమే.. ఇటీవల అనంతపురం పార్లమెంట్ టిక్కెట్టు జేసీ పవన్‌కు కేటాయించే అంశం మరోసారి సీఎం వద్ద జేసీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో 7 నియోజకవర్గాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలతో పవన్‌కు అనుకూలంగా లెటర్ తీసుకుని రావాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. దీనికి జేసీ స్పందిస్తూ ‘వాళ్లెవరూ గెలవరు.. వారిని మార్చుకోవాలని నేను చెబుతున్నాగా!’ అని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి తిరిగి సీఎం మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేలు ఎవ్వరూ గెలవకపోతే నీ కుమారుడు ఎలా ఎంపీగా గెలుస్తారని అనుకుంటున్నావ్! అసలు వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి పరిస్థితి ఏంటి? టీడీపీ నేతలు పార్టీకి దూరం కావడం, ప్రభోదానంద ఆశ్రమ ఘటనతో అక్కడే గెలుపు కష్టంగా ఉంది. పైగా వైఎస్సార్సీపీ నేతలు పార్లమెంట్ పరిధిలో బీసీలతో వెళుతున్నారు. పార్లమెంట్లో మీ పరిస్థితి ఇప్పుడేం బాగోలేదు. పైగా రాష్ట్రవ్యాప్తంగా ఒక ఫ్యామిలీకి ఒకే టిక్కెట్టు ఇవ్వాలనే పాలసీగా నిర్ణయించుకున్నాం. కాబట్టి తాడిపత్రి టిక్కెట్టు ఇస్తాం. మీరు ఎవ్వరైనా నిలబడండి. మాకు అభ్యంతరం లేదు. మంత్రి సునీత కూడా మిమ్మల్ని సాకుగా చూపి తన కుమారుడికి హిందూపురం ఎంపీ టిక్కెట్టు అడుగుతోంది.’ అని బదులిచ్చినట్లు సమాచారం. దీంతో దివాకర్‌రెడ్డి సీఎంకు నమస్కారం పెట్టి వెనుదిరిగినట్లు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
హైకోర్టుకు మళ్లీ ‘ఏపీ ఒలింపిక్’ వివాదం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఒలింపిక్ సంఘ వివాద పరిష్కారం కోసం ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీని సవాల్ చేస్తూ అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమదే అసలైన ఏపీ ఒలింపిక్ సంఘమంటూ పవన్‌రెడ్డి గతంలో వ్యాజ్యం దాఖలు చేయగా బైలా ప్రకారం మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలకు హైకోర్టు సూచించింది. అందుకు ఏపీ ఒలింపిక్ సంఘ అధ్యక్షుడైన గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ కూడా అంగీకరించారు. ఈ వ్యవహారంపై గౌహతి హైకోర్టు రిటైర్డ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీధర్‌రావు అధ్యక్షతన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షుడు రామచంద్రన్ ఓ మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో మరో ఇద్దరు రిటైర్డు న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్నారు. ఐఓఏలోని ప్యానెల్ ఆర్బిట్రేటర్లుగా ఉన్న వారితోనే మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ ఏర్పాటుకు ముందు కార్యనిర్వాహక కమిటీ సమావేశం కాలేదని, ప్యానెల్లో లేని వారితో కమిటీని ఏర్పాటు చేశారని, ఈ నేపథ్యంలో ఈ కమిటీ చెల్లదని పిటిషనర్ జేసీ పవన్‌రెడ్డి తన తాజా వ్యాజ్యంలో పేర్కొన్నారు. గల్లా జయదేవ్ కంపెనీలో రామచంద్రన్ కుమారుడు డైరెక్టర్‌గా పని చేస్తున్నారని, అందువల్లే జయదేవ్ అధ్యక్షతన ఉన్న ఏపీ ఒలింపిక్ సంఘానికి రామచంద్రన్ గుర్తింపు ఇచ్చారని, కానీ, తన అధ్యక్షతన ఉన్న సంఘమే అసలైనదని పవన్‌రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే, రిటైర్డ్ జడ్జీలతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా మూడు నెలల్లో సమస్యను కొలిక్కి తేవాలని గత సెప్టెంబర్ 5న హైకోర్టు ఆదేశించింది. ఐఓఏ అధ్యక్షుడు ప్యానెల్ ఆర్బిట్రేటర్స్‌ను కాదని ఇతరులతో కమిటీ ఏర్పాటు చేయడంతో మళ్లీ వివాదం హైకోర్టుకు చేరింది. -
'అసలైన ఒలింపిక్ సంఘం మాదే'
హైకోర్టులో జేసీ పవన్‌రెడ్డి పిటిషన్ హైదరాబాద్ : తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ నేతృత్వం వహిస్తున్న ఏపీ ఒలింపిక్ సంఘాన్ని అసలైన సంఘంగా గుర్తిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు, ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి జె.సి.పవన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గల్లా జయదేవ్‌కు అనుకూలంగా ఐఓఏ గత నెల 7న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపేయాలని ఆయన వ్యాజ్యంలో కోర్టును కోరారు. రాష్ట్ర విభజనను అడ్డంపెట్టుకుని, ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఒలపింక్ సంఘాన్ని హైజాక్ చేసేందుకు గల్లా జయదేవ్ కుట్రపన్నారని పవన్‌రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే తమ సంఘంలో సభ్యులుగా ఉన్న ఆర్.కె.పురుషోత్తం తదితరులతో భారీ కుట్రకు తెరలేపారన్నారు. అందులో భాగంగానే వీరంతా కలిసి 1960 నుంచి కొనసాగుతూ వస్తున్న ఏపీ ఒలంపిక్ అసోసియేషన్‌కు పోటీగా, సమాంతరంగా అదే పేరుతో మరో సంఘాన్ని ఏర్పాటు చేసి, ఎన్నికలు పెట్టుకుని తమదే అసలైన సంఘమని ప్రకటించుకున్నారని తెలిపారు. గత నెలలో తాము తమ సంఘానికి ఎన్నికలు నిర్వహించామని 102 సభ్యుల్లో 62 మంది సభ్యులు హాజరై ఓటు హక్కును వినియోగించుకున్నానని పవన్ పేర్కొన్నారు. శాప్ ప్రతినిధులు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయన్నారు. గల్లా జయదేవ్ గ్రూపుతో చేతులు కలిపినందు వల్ల ఐఓఏ ప్రతినిధులు హాజరు కాలేదని వివరించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఐఓఏ ప్రొసీడింగ్స్‌ను నిలిపేయాలని పవన్‌రెడ్డి కోర్టును కోరారు.