
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఒలింపిక్ సంఘ వివాద పరిష్కారం కోసం ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీని సవాల్ చేస్తూ అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమదే అసలైన ఏపీ ఒలింపిక్ సంఘమంటూ పవన్‌రెడ్డి గతంలో వ్యాజ్యం దాఖలు చేయగా బైలా ప్రకారం మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలకు హైకోర్టు సూచించింది. అందుకు ఏపీ ఒలింపిక్ సంఘ అధ్యక్షుడైన గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ కూడా అంగీకరించారు.
ఈ వ్యవహారంపై గౌహతి హైకోర్టు రిటైర్డ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీధర్‌రావు అధ్యక్షతన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధ్యక్షుడు రామచంద్రన్ ఓ మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో మరో ఇద్దరు రిటైర్డు న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్నారు. ఐఓఏలోని ప్యానెల్ ఆర్బిట్రేటర్లుగా ఉన్న వారితోనే మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీ ఏర్పాటుకు ముందు కార్యనిర్వాహక కమిటీ సమావేశం కాలేదని, ప్యానెల్‌లో లేని వారితో కమిటీని ఏర్పాటు చేశారని, ఈ నేపథ్యంలో ఈ కమిటీ చెల్లదని పిటిషనర్ జేసీ పవన్‌రెడ్డి తన తాజా వ్యాజ్యంలో పేర్కొన్నారు.
గల్లా జయదేవ్ కంపెనీలో రామచంద్రన్ కుమారుడు డైరెక్టర్‌గా పని చేస్తున్నారని, అందువల్లే జయదేవ్ అధ్యక్షతన ఉన్న ఏపీ ఒలింపిక్ సంఘానికి రామచంద్రన్ గుర్తింపు ఇచ్చారని, కానీ, తన అధ్యక్షతన ఉన్న సంఘమే అసలైనదని పవన్‌రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే, రిటైర్డ్ జడ్జీలతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీ ద్వారా మూడు నెలల్లో సమస్యను కొలిక్కి తేవాలని గత సెప్టెంబర్ 5న హైకోర్టు ఆదేశించింది. ఐఓఏ అధ్యక్షుడు ప్యానెల్ ఆర్బిట్రేటర్స్‌ను కాదని ఇతరులతో కమిటీ ఏర్పాటు చేయడంతో మళ్లీ వివాదం హైకోర్టుకు చేరింది.