నీ కుమారుడు ఎలా ఎంపీగా గెలుస్తారని అనుకుంటున్నావ్‌! | CM Chandrababu Big Shock On JC Diwakar Reddy family | Sakshi
Sakshi News home page

నీ కుమారుడు ఎలా ఎంపీగా గెలుస్తారని అనుకుంటున్నావ్‌!

Published Sun, Nov 11 2018 8:54 AM | Last Updated on Sun, Nov 11 2018 8:54 AM

CM Chandrababu Big Shock On JC Diwakar Reddy family - Sakshi

తెలుగుదేశం పార్టీలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఎదురుగాలి వీస్తోందా? తన కుమారుడిని రాజకీయంగా నిలపాలనుకున్న ఆశలు అడియాసలవుతున్నాయా? తాడిపత్రి మినహా మరెక్కడా జేసీ ఫ్యామిలీకి చోటు దక్కదా? టీడీపీలో తాజా పరిణామాలను బేరీజు వేస్తే ఔననే సమాధానం వస్తోంది. అనంతపురం ఎంపీ, పార్లమెంట్‌ పరిధిలోని ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలు జేసీకి ముప్పు తెచ్చిపెట్టాయి. మైకు దొరికితే నోటికేదొస్తే అది ఇష్టానుసారం మాట్లాడే ఎంపీ దివాకర్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన షాక్‌తో నోట్లో పచ్చివెలక్కాయపడినట్లయింది. జేసీ ఫ్యామిలీకి తాడిపత్రి మినహా అనంతపురం ఎంపీ టిక్కెట్టు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారని టీడీపీ ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న చర్చ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జేసీ దివాకర్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 2014 వరకూ తాడిపత్రిలోనే సాగింది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జేసీ బ్రదర్స్‌ టీడీపీలో చేరారు. అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత నాలుగున్నరేళ్లలో తాడిపత్రి మినహా పార్లమెంట్‌ పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండలేకపోయారు. అనంతపురం, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యేలను మార్చాలని సీఎం ముందు పలు సందర్భాల్లో ప్రతిపాదన పెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాయదుర్గంలో కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, మంత్రి కాలవతో విభేదించారు. అతనూ ‘దుర్గం’ టిక్కెట్‌ రేసులో ఉన్నారు.

 దీంతో కాలవ కూడా జేసీని వ్యతిరేకించే పరిస్థితి తలెత్తింది. ఒక్కమాటలో చెప్పాలంటే జేసీ ఒకవైపు.. తక్కిన ఎమ్మెల్యేలు మరోవైపు అన్నట్లు పరిస్థితి తయారైంది. ఈ రెండువర్గాలు పరస్పరం సీఎంకు ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. ఈ క్రమంలో జేసీ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తన కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డికి ఎంపీ టిక్కెట్టు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టారు. మొదట్లో చంద్రబాబు దీనికి అంగీకరించినట్లే తెలుస్తోంది. కానీ పవన్‌ను ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించడం, తరచూ తనదైన శైలి వ్యాఖ్యలతో జేసీ పట్ల ప్రజల్లో చులకనభావం ఏర్పడటం, తాడిపత్రిలో ఇటీవల జరిగిన ఆశ్రమ ఘటన.. వెరసి చంద్రబాబు కూడా ఆలోచనలో పడ్డట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

డోలాయమానంలో గురునాథ్, మధుసూదన్‌గుప్తా
తాజా పరిణామాలతో జేసీ దివాకర్‌రెడ్డి డీలాపడ్డారు. జేసీ సిఫార్సుతో టీడీపీలోకి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అక్కడ ఇమడలేని పరిస్థితి. అహుడా చైర్మన్‌ చేస్తామని హామీ ఇచ్చి తర్వాత చేయిచ్చారు. గురునాథరెడ్డి కూడా అనంతపురం వదిలి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. దీంతో గురునాథరెడ్డి వర్గం పూర్తిగా ఆ కుటుంబానికి దూరమైపోయింది. అహుడాపై గురునాథరెడ్డి సోదరుడు ఎర్రిస్వామిరెడ్డి జేసీని కలిసి ఆరా తీస్తే ఇప్పుడు పరిస్థితి బాగోలేదని తన బాధన వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.

 దీంతో రాజకీయంగా ఉనికి కోల్పోకూడదనుకుంటే టీడీపీని వీడి స్వతంత్రంగా బరిలోకి దిగాలని గురునాథరెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే రాజకీయంగా కనుమరుగు కావడం ఖాయమనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతోపాటు జేసీని నమ్మి మధుసూదన్‌గుప్తా కూడా టీడీపీకి చేరువయ్యారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఇప్పిస్తాననే జేసీ హామీతో అమరావతి దాకా వెళ్లి వెనక్కి వచ్చిన గుప్తాకు ఇప్పటి వరకు టీడీపీలోకి ఎంట్రీ దొరకలేదు.

 దీనికి కారణం జేసీపై చంద్రబాబుకు నమ్మకం సన్నగల్లడమే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు దక్కకపోతే ఇతనూ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు గుప్తా వర్గీయులు చెబుతున్నారు. ఈ పరిణామాలు బేరీజు వేస్తే జేసీతో పాటు ఆయన వర్గానికి టీడీపీలో పూర్తిగా ప్రాధాన్యం లేదని స్పష్టమవుతోంది. ఇదే సమయంలో జేసీపై తాము పైచేయి సాధించామని టీడీపీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. అయితే ఎన్నికల వాతావరణం మొదలైన నేపథ్యంలో మున్ముందు ఇంకెలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో వేచి చూడాల్సిందే. 

తాడిపత్రి టిక్కెట్టు మాత్రమే..
ఇటీవల అనంతపురం పార్లమెంట్‌ టిక్కెట్టు జేసీ పవన్‌కు కేటాయించే అంశం మరోసారి సీఎం వద్ద జేసీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో 7 నియోజకవర్గాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలతో పవన్‌కు అనుకూలంగా లెటర్‌ తీసుకుని రావాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. దీనికి జేసీ స్పందిస్తూ ‘వాళ్లెవరూ గెలవరు.. వారిని మార్చుకోవాలని నేను చెబుతున్నాగా!’ అని చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి తిరిగి సీఎం మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేలు ఎవ్వరూ గెలవకపోతే నీ కుమారుడు ఎలా ఎంపీగా గెలుస్తారని అనుకుంటున్నావ్‌! అసలు వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి పరిస్థితి ఏంటి? టీడీపీ నేతలు పార్టీకి దూరం కావడం, ప్రభోదానంద ఆశ్రమ ఘటనతో అక్కడే గెలుపు కష్టంగా ఉంది. పైగా వైఎస్సార్‌సీపీ నేతలు పార్లమెంట్‌ పరిధిలో బీసీలతో వెళుతున్నారు. పార్లమెంట్‌లో మీ పరిస్థితి ఇప్పుడేం బాగోలేదు. పైగా రాష్ట్రవ్యాప్తంగా ఒక ఫ్యామిలీకి ఒకే టిక్కెట్టు ఇవ్వాలనే పాలసీగా నిర్ణయించుకున్నాం. కాబట్టి తాడిపత్రి టిక్కెట్టు ఇస్తాం. మీరు ఎవ్వరైనా నిలబడండి. మాకు అభ్యంతరం లేదు. మంత్రి సునీత కూడా మిమ్మల్ని సాకుగా చూపి తన కుమారుడికి హిందూపురం ఎంపీ టిక్కెట్టు అడుగుతోంది.’ అని బదులిచ్చినట్లు సమాచారం. దీంతో దివాకర్‌రెడ్డి సీఎంకు నమస్కారం పెట్టి వెనుదిరిగినట్లు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement