హైకోర్టులో జేసీ పవన్‌రెడ్డి పిటిషన్
హైదరాబాద్ : తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ నేతృత్వం వహిస్తున్న ఏపీ ఒలింపిక్ సంఘాన్ని అసలైన సంఘంగా గుర్తిస్తూ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు, ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి జె.సి.పవన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గల్లా జయదేవ్‌కు అనుకూలంగా ఐఓఏ గత నెల 7న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను నిలిపేయాలని ఆయన వ్యాజ్యంలో కోర్టును కోరారు.
రాష్ట్ర విభజనను అడ్డంపెట్టుకుని, ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఒలపింక్ సంఘాన్ని హైజాక్ చేసేందుకు గల్లా జయదేవ్ కుట్రపన్నారని పవన్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే తమ సంఘంలో సభ్యులుగా ఉన్న ఆర్.కె.పురుషోత్తం తదితరులతో భారీ కుట్రకు తెరలేపారన్నారు. అందులో భాగంగానే వీరంతా కలిసి 1960 నుంచి కొనసాగుతూ వస్తున్న ఏపీ ఒలంపిక్ అసోసియేషన్‌కు పోటీగా, సమాంతరంగా అదే పేరుతో మరో సంఘాన్ని ఏర్పాటు చేసి, ఎన్నికలు పెట్టుకుని తమదే అసలైన సంఘమని ప్రకటించుకున్నారని తెలిపారు.
గత నెలలో తాము తమ సంఘానికి ఎన్నికలు నిర్వహించామని 102 సభ్యుల్లో 62 మంది సభ్యులు హాజరై ఓటు హక్కును వినియోగించుకున్నానని పవన్ పేర్కొన్నారు. శాప్ ప్రతినిధులు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సమక్షంలో ఈ ఎన్నికలు జరిగాయన్నారు. గల్లా జయదేవ్ గ్రూపుతో చేతులు కలిపినందు వల్ల ఐఓఏ ప్రతినిధులు హాజరు కాలేదని వివరించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఐఓఏ ప్రొసీడింగ్స్‌ను నిలిపేయాలని పవన్‌రెడ్డి కోర్టును కోరారు.
'అసలైన ఒలింపిక్ సంఘం మాదే'
Published Mon, May 2 2016 5:14 PM | Last Updated on Sat, Mar 23 2019 9:06 PM
Advertisement
Advertisement