నిమ్మల కిష్టప్ప ( ఫైల్ ఫోటో )
ఆయన ఓ సీనియర్ పొలిటీషియన్. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేశారు. పన్నేండేళ్ల క్రితం నియోజకవర్గాల పునర్విభజనలో అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయారు. ఆ నేత ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తన భవిష్యత్తు కోసం ప్రశ్నార్థకంగా ఎదిరిచూస్తున్నారు. ఆయనే నిమ్మల కిష్టప్ప.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. గోరంట్ల అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించిన నిమ్మల కిష్టప్ప చంద్రబాబునాయుడు క్యాబినెట్లో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 2004 నిమ్మల కిష్టప్ప ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో గోరంట్ల అసెంబ్లీ నియోజకవర్గం రద్దయింది. దాని స్థానంలో పుట్టపర్తి నియోజకవర్గం ఏర్పడింది. గోరంట్ల మండలం పెనుకొండ నియోజకవర్గంలో కలిసిపోయింది. దీంతో నిమ్మల కిష్టప్ప హిందూపురం పార్లమెంటుకు షిప్ట్ అయ్యారు. హిందూపురం నుంచి ఎంపీగా ఒకసారి విజయం సాధించారు. ఆ తర్వాత పుట్టపర్తి లేదా పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేద్దామనుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.
అసెంబ్లీకి వెళ్ళడానికి వీలు లేకపోయినా... మళ్ళీ హిందూపురం పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేద్దామని అనుకుంటున్నారు. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు అదీ దక్కే పరిస్థితులు కనిపించడంలేదు. వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీ టిక్కెట్ నిమ్మల కిష్టప్పకు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించినట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. నిమ్మల కిష్టప్ప స్థానంలో మరో బీసీ నేతకు ఇక్కడ అవకాశం కల్పించాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిమ్మల కిష్టప్పకు టిక్కట్ ఉండదన్న సంకేతాలు ఇచ్చినట్లు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం వైఖరిపై నిమ్మల కిష్టప్ప గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
పార్టీలో అత్యంత సీనియర్ అయిన తనకే టిక్కెట్ ఇవ్వకపోతే ఎలా అని నిమ్మల కిష్టప్ప సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. తనకు టిక్కెట్ దక్కకపోతే తన సామాజిక వర్గమైన నేతన్నలు తెలుగుదేశం పార్టీకి దూరమవటం ఖాయమని కిష్టప్ప స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లుగా టిక్కెట్ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీని ఏవిధంగా దెబ్బతీయాలి. ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న దానిపై ఇప్పటికే నిమ్మల కిష్టప్ప వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా పచ్చ పార్టీలో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment