సాక్షి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కార్ల అమ్మకాలు దూసుకెళ్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పుడు నాలుగు చక్రాల వాహనాలకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు కారు హోదాగా భావించే సగటు కుటుంబాలు.. ఇప్పుడు నిత్యావసరంగా భావిస్తున్నాయి. సొంత ఇల్లు ఎంత ముఖ్యమో కారు ఉండటమూ అంతేననే ఆలోచన ఏర్పడింది. ముఖ్యంగా కోవిడ్ అనంతరం చిన్న చిన్న ఉద్యోగులు కూడా కారు వైపు మొగ్గు చూపుతున్నారు. కుటుంబంతో కలిసి సొంతకారులో ప్రయాణించాలన్న ఆలోచన బలంగా ఏర్పడింది.
కార్లకు భారీ డిమాండ్..
ఐదేళ్ల క్రితం అనంతపురం జిల్లా కేంద్రంగా మహా అంటే నెలకు 80 నుంచి 100 కార్లు అమ్ముడయ్యేవి. తాజా గణాంకాలు చూస్తే నెలకు 400కు పైగా అమ్ముడవుతున్నాయి. దీన్నిబట్టి కార్ల డిమాండ్ ఎలా ఉందో అంచనా వేయచ్చు. కియా, మహీంద్రా, హ్యుందాయ్, మారుతి, టాటా వంటి కార్లకు బాగా డిమాండ్ ఉంది. కారు బుక్ చేసుకున్న తర్వాత కనీసం మూడు మాసాలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్నట్టు షోరూం నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని కార్లకు 6 మాసాలు కూడా పడుతోంది. పండుగలు, ప్రత్యేక పర్వదినాల వేళ 500 కార్లు అమ్ముడైన సందర్భాలున్నాయి.
కుటుంబ ప్రయాణాలపై మొగ్గు..
ఒకప్పుడు బస్సు, రైలు ప్రయాణాలు ఎక్కువ. ఇప్పుడు రూ.40 వేలు వేతనం తీసుకునే ఉద్యోగి కూడా కుటుంబంతో కలిసి కారులో ప్రయాణం చేయాలనుకుంటున్నారు. దీంతోపాటు సులభతర వాయిదాల్లో లోన్లు లభిస్తున్నాయి. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కార్లలో ప్రయాణమే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నారు. కొత్త కార్లకే కాదు సెకండ్ హ్యాండ్ కార్లకూ ఇప్పుడు మంచి మార్కెట్ ఉన్నట్టు ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.
కొనుగోలు శక్తి పెరిగింది
ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. చిన్న చిన్న ఉద్యోగులు కూడా కారు కొనుక్కోవాలనే ఆలోచనలో ఉన్నారు. గతంతో పోల్చితే ఇప్పుడు చాలా ఎక్కువ మార్కెట్ ఉంది. ముఖ్యంగా కోవిడ్ అనంతరం జిల్లాలో కార్ల అమ్మకాల మార్కెట్ పెరిగింది.
– వంశీ, జనరల్ మేనేజర్, మహీంద్రా కంపెనీ
అక్కడ జాప్యం జరుగుతోందని..
మాది కృష్ణా జిల్లా కలిదిండి. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కొనాలనుకున్నా. కానీ విజయవాడలో 7 మాసాలు వెయిటింగ్ అని చెప్పారు. తెలిసిన వాళ్లుంటే అనంతపురంలో కొన్నా. ఈ వారంలో డెలివరీ ఇస్తున్నారు. ఆ వాహనం నాకు బాగా ఇష్టం.
– ఎం.నాగరాజు, కలిదిండి
ఆదాయం గణనీయంగా పెరిగింది
రవాణాశాఖకు ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 206.42 కోట్లు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. డిసెంబర్ నాటికి రూ.154 కోట్లు టార్గెట్ కాగా రూ. 132 కోట్లు వసూలైంది. ఇందుకు కారణం వాహనాల కొనుగోలు పెరగడమే. ముఖ్యంగా కార్ల కొనుగోలు శాతం భారీగా పెరిగింది. మధ్యతరగతి వారు సైతం కార్లను కొనుగోలు చేస్తున్నారు.
– శివరామప్రసాద్, ఉపరవాణా కమిషనర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment