
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం తాడిపత్రి అల్లర్ల ఘటనలపై సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు లాంటి అంశాలపై సిట్ ఆరా తీస్తోంది. మరోవైపు.. అరెస్టులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాతే నివేదికను సిద్ధం చేయాలని సిట్ భావిస్తోంది.
పల్నాడు జిల్లాలో పోలింగ్ డే ఘటనల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని పోలీసులు గుర్తిస్తున్నారు. నిన్న(గురువారం) పల్నాడులో 60 మందికిపైగా అరెస్టులు జరిగాయి. 33 మంది పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుల్ని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచి.. నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
పల్నాడుపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పల్నాడు జిల్లా పోలింగ్ నాటి హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోనే విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది.
ఈవీఎం ధ్వంసం వెనుక కారణాలపై సిట్ ఆరా తీస్తోంది. పిన్నెల్లి వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించగా, వీడియో బయటకు ఎలా వచ్చిందనేదానిపై సిట్ విచారణ చేపట్టనుంది. కుట్ర కోణాలు ఉన్నాయా? అనే అంశంపై సిట్ పరిశీలించనుంది. మాచర్ల, పల్నాడు ఈవీఎం ఘటనలపై సిట్ సమగ్ర నివేదిక సిద్ధం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment