సాక్షి, అనంతపురం: అనంతపురం ఆఫీసర్స్ క్లబ్‌లో పేకాట ఆడిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పేకాట ఆడకపోవడం వల్ల కరోనా సమయం లో 22 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లబ్బుల్లో పేకాట ఆడేందుకు కృషి చేస్తానంటూ ఎమ్మెల్యే ప్రసాద్ సెలవించారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రజలు మండిపడుతున్నారు. అభివృద్ది మరిచి.. పేకాట కోసం సీఎంను కలుస్తారా? అంటూ విమర్శిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
పోలీసుల సమక్షంలోనే తన్నుకున్న టీడీపీ నేతలు
ఉరవకొండ: స్థానిక పోలీస్టు స్టేషన్ ఎదుటనే టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. పరస్పర దాడులతో రెచ్చిపోయారు. వివరాలు.... ఉరవకొండ మండలం నింబగల్లు వద్ద ఉన్న సమ్మర్ స్టొరేజీ ట్యాంక్ పరిశీలనకు సోమవారం ఉదయం మంత్రి పయ్యావుల కేశవ్ వెళ్లారు. అనంతరం కొనకొండ్లకు వెళుతున్న మంత్రి కాన్వాయ్ వెంట వాహనాల్లో టీడీపీ నేతలూ అనుసరించారు. ఉరవకొండలోని పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వెళుతున్న వై.రాంపురం గ్రామ టీడీపీ నేత సంజీవరాయుడు వాహనాన్ని వెనుకనే ఉన్న అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నేత వాహనం ఢీకొంది.
ఆ సమయంలో వాహనాలను ఆపి ఇరువర్గాల నాయకులు వాదులాటకు దిగారు. వారి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. అదే సమయంలో లత్తవరం గ్రామ మాజీ సర్పంచ్ గోవిందు కలుగజేసుకుని నడి రోడ్డు మీద తోపులాటకు దిగిన టీడీపీ నాయకులను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో సంజీవరాయుడు వర్గం గోవిందుపై తిరగబడింది. వెంటనే గోవిందు అనుచరులు వారితో కలబడ్డారు. పరస్పర దాడులతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి ఇరువర్గాలను అక్కడి నుంచి సాగనంపారు.
Comments
Please login to add a commentAdd a comment