మృతదేహాన్ని ప్రయాణికులు గుర్తించడంతో కారు వదిలేసి ఉడాయించిన ఘనుడు
అనంతపురం జిల్లా వై.కొత్తపల్లి వద్ద ఘటన
ఆత్మకూరు: ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారుతో ఢీకొన్నాడు. ఎగిరి కారుపై పడి మృతిచెందిన యువకుడిని అలాగే 15 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. అటుగా వెళుతున్న వాహనదారులు కారు పైభాగంలో మృతదేహం ఉండటాన్ని గుర్తించి అప్రమత్తం చేయడంతో కారును రోడ్డుపక్కన ఆపి ఉడాయించాడు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన జెన్నే ఎర్రిస్వామి (35)కి ఆత్మకూరు మండలం సిద్ధరామపురం గ్రామానికి చెందిన మంజులతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్న ఎర్రిస్వామి ఆదివారం ద్విచక్ర వాహనంపై అత్తారింటికి వచ్చాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై అనంతపురానికి బయలుదేరాడు. జాతీయ రహదారిపై వై.కొత్తపల్లి వద్దకు చేరుకోగా.. ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఢీకొంది. దీంతో ఎర్రిస్వామి కారు పైభాగంపై పడి మృతి చెందాడు.
ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును ఆపకుండా నిర్లక్ష్యంగా ముందుకు దూసుకెళ్లాడు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద వాహన చోదకులు కారు పైభాగంపై మృతదేహం ఉండటాన్ని గుర్తించి.. కారు డ్రైవర్‌కు చెప్పారు. దీంతో కారును రోడ్డు పక్కన ఆపి, టాప్‌పై పడి ఉన్న మృతదేహాన్ని గమనించి అక్కడి నుంచి ఉడాయించాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment