
కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
నవ వధువు సోదరుడు, స్నేహితురాలు మృతి
జగిత్యాల: ఆర్టీసీ బస్సు కారు ను ఢీకొన్న సంఘటనలో నవవధువు సోదరుడు, ఆమె స్నేహితురాలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం వేకువజామున జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌కు చెందిన వలిపిరెడ్డి రాజమల్లు, లక్ష్మి కూతురు సంఘవి పెళ్లి ఈనెల 8న జనగామకు చెందిన ఓ యువకుడితో హన్మకొండలో జరిగింది.
శనివారం రాత్రి రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న సంఘవి సోదరుడు సంకీర్తన్ (30), హైదరా బాద్‌లో సంఘవితో కలిసి పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా నారాయణవనంకు చెందిన సాధు మునిరాజీ (25)తోపాటు తల్లి లక్ష్మి, తండ్రి రాజమల్లు కారులో జగిత్యాలకు వస్తున్నారు. ధరూర్ సమీపంలోకి రాగానే జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు వీరి కారును ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో సంకీర్తన్‌తోపాటు మునిరాజీ అక్కడికక్కడే చనిపోయారు. లక్ష్మి, రాజమల్లు పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
రూరల్ సీఐ వై.కృష్ణారెడ్డి, ఎస్సై సుధాకర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. సంకీర్తన్ మేనమామ ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. పెళ్‌లైన రెండురోజులకే సోదరుడితో పాటు స్నేహితురాలు మృతి చెందడంతో సంఘవి తీవ్రంగా రోదించింది. గాయాలతోనే ఉన్న తండ్రి రాజమల్లు సంకీర్తన్ చితికి నిప్పంటించడం స్థానికులను కలచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment