భువనగిరి: ప్రసవం కోసం ఆపరేషన్ చేసిన సమయంలో వైద్యులు నిర్లక్ష్యంతో కడుపులో కాటన్ పెట్టి మరిచిపోయారు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురైన ఆ మహిళ మంగళవారం మృతి చెందింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కేకే ఆస్పత్రి వద్ద వైద్యుల నిర్లక్ష్యంపై మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేశారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరికి చెందిన చింతపల్లి ప్రవీణ్ భార్య మమత (21) మొదటి కాన్పు కోసం సంవత్సరం క్రితం భువనగిరి పట్టణంలోని కేకే నర్సింగ్ హోంలో చేరింది.
ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి కాన్పు చేయగా ఆ మహిళ పాపకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని నెలల తర్వాత ఆమె తిరిగి రెండోసారి గర్భం దాల్చింది. ప్రతి నెలా చికిత్స కోసం అదే నర్సింగ్‌హోంకు వెళ్తోంది. ప్రస్తుతం ఆమెకు 6వ నెల. 15 రోజుల క్రితం కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు మందులు రాసి ఇంటికి పంపించారు. అయితే నొప్పి తిరగబెట్టడంతో మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. వెంటనే హైదరాబాద్‌కు వెళ్లగా అక్కడ ఆస్పత్రి వైద్యులు చికిత్స చేయలేమని చెప్పడంతో మరో ఆస్పత్రికి వెళ్లారు.
మమత మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
ఈ విధంగా మూడు నాలుగు ఆస్పత్రులు తిరగడంతో ఆమెకు గర్భస్రావమైంది. ఈ సమయంలో సన్‌ఫ్లవర్ ఆస్పత్రి వైద్యులను కుటుంబ సభ్యులు బతిమిలాడటంతో పరిస్థితి విషమించిందని తెలిపి, కుటుంబ సభ్యుల వద్ద హామీ తీసుకుని ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమె గర్భంలో కాటన్ ఉన్నట్లుగా గుర్తించారు. ప్రసవం కోసం నిర్వహించిన ఆపరేషన్ సమయంలో రక్తస్రావాన్ని నిరోధించేందుకు ఉంచిన కాటన్ కడుపులోనే మర్చిపోయి కుట్లు వేశారని, ఆ కారణంగా కడుపులో ఇన్‌ఫెక్షన్ ఏర్పడి ప్రాణానికి ముప్పుగా మారిందని చెప్పారు.
అయితే చికిత్స పొందుతూ ఆ గర్భిణి మంగళవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మమత మృతదేహంతో పట్టణంలోని కేకే నర్సింగ్‌హోం వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment