సాగర్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న స్థానికులు
సైదాబాద్: తోటిపిల్లలతో కలసి ఇంటి ముందు సరదాగా ఆడుకుంటున్న ఓ చిన్నారిపై కామాంధుడి కన్నుపడింది. అభంశుభం తెలియని ఆ బాలికకు చాక్లెట్ ఆశ చూపాడు. నమ్మి అతడి ఇంటికి వెళ్లిన బాలికపై అత్యాచారం చేసి హతమార్చాడు. ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి... నల్లగొండ జిల్లా దేవరకొండ సమీప తండా నుంచి బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన ఓ గిరిజన కుటుంబం సింగరేణి కాలనీలో నివసిస్తోంది.
గురువారం తల్లిదండ్రులు పనికి వెళ్లగా కూతురు(6) ఇంటి వద్ద తోటిపిల్లలతో కలసి ఆడుకుంటోంది. వారి ఇంటి పక్కనే చిల్లర దొంగతనాలు చేసే యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుకు చెందిన రాజు(30) ఉంటున్నాడు. సంవత్సరం క్రితం అతని ప్రవర్తన నచ్చక భార్య వదిలేసింది. ఈ క్రమంలో గురువారం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్ ఆశ చూపించి ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేశాడు. తరువాత గొంతు నులిమి చంపేశాడు.
మృతదేహాన్ని పరుపులో చుట్టి అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో అక్కడే వదిలేసి పరారయ్యాడు. అదేరోజు సాయంత్రం నుంచి తమ కూతురు కనపడటంలేదని తల్లిదండ్రులు సింగరేణి కాలనీ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడి ఇంట్లోనే చిన్నారి మృతదేహం
బాలిక తల్లిదండ్రులు, స్థానికులు రాజుపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో రాజు ఇంటి తాళం పగలకొట్టి చూడగా పరుపులో చుట్టి ఉన్న బాలిక మృతదేహం లభించింది. దీంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించటానికి ప్రయత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసులు వారికి సర్దిచెప్పి బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఏడు గంటలపాటు నిరసన
బాలిక హత్యాచారానికి గురైన విషయం తెలుసుకున్న స్థానికులు, పలు సంఘాల వారు సింగరేణి కాలనీలో శుక్రవారం నిరసనకు దిగారు. నిందితుడ్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అనంతరం సాగర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫి క్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. విషయం తెలుసుకున్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ సంఘటనాస్థ లిని సందర్శించి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.
ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుం బానికి ప్రభుత్వం అన్నివిధాలా బాసటగా ఉంటుందని హామీనిచ్చారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు, వారి కుటుంబంలోని ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగంతోపా టు వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని కలెక్టర్ హామీనిచ్చారు. తక్షణ సహాయం కింద రూ.50 వేల చెక్కును వారికి అందజేశారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయటం ద్వారా నిందితుడికి కఠినశిక్ష పడేలా చూస్తామని కలెక్టర్, అడిషనల్ కమిషనర్ రమేశ్‌రెడ్డి హామీ ఇవ్వటంతో నిరసనకారులు ఆందోళన విరమించారు.
నిందితుడు రాజు (ఫైల్‌ఫొటో)
పోలీసుల అదుపులో నిందితుడి అక్క, బావ
అడ్డగూడూరు/చందంపేట: నిందితుడు రాజు కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో రాజు అక్క, బావను శుక్రవారం అడ్డగూడూరులో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. నిందితుడిని సైతం అదుపులో తీసుకున్నట్లు టీవీల్లో ప్రసారం కావడంతో మండల ప్రజలు ఉలిక్కిపడ్డారు. కాగా, రాజు స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల అని, అతని అక్క, బావ అడ్డగూడూరులో ఉంటారని అంటున్నారు. హత్యాచారానికి గురైన చిన్నారి అంత్యక్రియలు స్వగ్రామం నక్కలగండితండాలో శుక్రవారం రాత్రి పోలీస్ బందోబస్తు నడుమ జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment