‘గాంధీ’కి పోటెత్తుతున్న గర్భిణీలు..
పాలనా యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
గాంధీ ఆస్పత్రి : సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఆపరేషన్లు నిలిపివేసిన నేపధ్యంలో గాంధీ ఆస్పత్రికి గర్భిణీలు పోటెత్తుతున్నారు. వైద్యులు, సిబ్బందితో పాటు మంచాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో గైనకాలజీ వార్డు, లేబర్ రూమ్‌ల్లో 160 మంచాలుండగా సుమారు 250 మందికి సర్ధుబాటు చేస్తున్నారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రిలో డెలివరీలు నిలిపివేయడంతో నిరుపేదలు గాంధీ దారిపట్టడంతో ఓపీకి వచ్చేవారి సంఖ్య అమాంతంగా 350కి పెరిగింది. బెడ్లు అందుబాటులో లేకపోవడంతో ఒకే మంచంపై ఇద్దరు ముగ్గురికి సర్దుబాటు చేస్తున్నారు.
వార్డుల బయట మంచాలు ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. గైనకాలజీ విభాగానికి రద్ధీ పెరిగినందున రోగులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్, గైనకాలజీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ జేవీరెడ్డి తెలిపారు. సుల్తాన్‌బజార్ ఆస్పత్రికి చెందిన వైద్యులు, సిబ్బంది ఇక్కడికే వచ్చి వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఐదు ఆపరేషన్ థియేటర్లను 24 గంటల పాటు అందుబాటులో ఉంచామన్నారు.