సాక్షి, అమరావతి: గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం వారికి వరంగా మారింది. ఒకవైపు ప్రతినెలా ప్రభుత్వాస్పత్రుల్లో 9న ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ (పీఎంఎస్‌ఎం) నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా గర్భిణులకు మధుమేహం, బీపీ, రక్త పరీక్షలు, అవసరం మేరకు స్కానింగ్‌లు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నారు. మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ప్రతి గర్భిణికి గ్రామాల్లో నెలలో రెండుసార్లు వైద్యులు సేవలందిస్తున్నారు.
నెలకు మూడుసార్లు
గర్భిణులకు ప్రసవంలోగా నాలుగుసార్లు, బాలింతలకు ప్రసవానంతరం ఆరుసార్లు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలందించాలనేది కేంద్ర ఆరోగ్య శాఖ నిబంధన. హైరిస్క్ గర్భిణులకు 8సార్లు ప్రసవంలోగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ.. ఇతర రాష్ట్రాల్లో లేనట్టుగా మన రాష్ట్రంలో నెలలో మూడుసార్లు గర్భిణులు, బాలింతలకు వైద్య సేవలు అందుతున్నాయి.
పీఎంఎస్‌ఎం డే రోజున ఆస్పత్రుల్లో ఒకసారి, ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వచి్చన సందర్భంలో రెండుసార్లు చొప్పున వైద్యులు సేవలు అందిస్తున్నారు. మరోవైపు మిగిలిన రోజుల్లో గ్రామాల్లోని డాక్టర్ వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లలో ఉండే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో), ఏఎన్‌ఎం వాకబు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతినెలా గర్భిణులు, బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్‌బీ) టెస్ట్ నిర్వహించి రక్తహీనతను పర్యవేక్షిస్తున్నారు.
రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి వారిపై మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తీవ్ర రక్తహీనత ఉన్న వారికి కృత్రిమంగా రక్తం ఎక్కించడం, ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్‌లు వేయడం చేస్తున్నారు. అదేవిధంగా గర్భిణులకు ఆరోగ్యశ్రీ కింద మూడు స్కాన్‌లను ఉచితంగా ప్రభుత్వం చేయిస్తోంది. ఇందులో ఒక స్కాన్‌ను వైద్యుల సూచనల మేరకు టిఫ్ఫా స్కాన్ చేయిస్తున్నారు.
ఆగస్టులో 2.04 లక్షల మందికి..
ఫ్యామిలీ డాక్టర్ విధానంలో ఆగస్టు నెలలో 2.26 లక్షల మంది గర్భిణులకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా 90.41 శాతం 2.04 లక్షల మందికి సేవలు అందించారు. 64,092 బాలింతలకు గాను 92.29 శాతం 59,149 మంది బాలింతలకు వైద్యం చేశారు. గ్రామాలకు వెళుతున్న ఫ్యామిలీ డాక్టర్‌లు బాలింతల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం చేస్తున్నారు. మరోవైపు కార్యక్రమం మొదలైనప్పటి నుంచి గ్రామాల్లోనే గర్భిణులకు 14.74 లక్షలు, బాలింతలకు 5.08 లక్షల సేవలను వైద్య శాఖ అందించింది.
తల్లీబిడ్డ ఆరోగ్యానికి రక్ష
కొందరు గర్భిణులు యాంటీనేటల్ కేర్ (ఏఎన్‌సీ), పోస్ట్‌నేటల్(పీఎన్‌సీ)కు దూరమైన గర్భిణులు, బాలింతల వివరాలు ఫ్యామిలీ డాక్టర్‌కు ఆన్‌లైన్‌లో పంపుతున్నాం. వారికి గ్రామాల్లోనే వైద్యులు సేవలు అందిస్తున్నారు. మెరుగైన వైద్యం అవసరం అనుకున్న వారిని దగ్గరలోని పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. మాతా, శిశు మరణాల కట్టడికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఇలా వివిధ కార్యక్రమాల ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యానికి ప్రభుత్వం రక్షగా నిలుస్తోంది.
– డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, వైద్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment