
స్ట్ట్రాబెర్రీలతో ఎన్నెన్నో ప్రయోజనాలు!
పరిపరి శోధన
కంటికి మేలు కలగాలంటే క్యారట్ తినాలని తెలుసు. గర్భవతులకు పాలకూర వంటి ఆకుకూరల్లో ఉండే ఫోలిక్ యాసిడ్ మేలు కలిగిస్తుందని తెలుసు. అలాంటి మేళ్లు ఎన్నో కలగలసి ఒక్క స్ట్రాబెర్రీ పండ్లలోనే ఉన్నాయని తాజా అధ్యయనాల్లో తెలిసింది. స్ట్రాబెర్రీల వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఇవే...
మంచి చూపు కోసం
వయసు పెరుగుతున్న కొద్దీ చూపునకు సంబంధించిన కొన్ని మార్పులు వచ్చి కంటిచూపు కాస్త తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను సాధారణంగా ఏజ్ రిలేటెడ్ విజన్ లాస్ లేదా ఏజ్ రిలేటెడ్ మాలిక్యులార్ డీజనరేషన్ అంటుంటారు. కానీ ఇలా వయసు పెరిగే కొద్దీ చూపు తగ్గే సమస్యను తగ్గించడానికి స్ట్రాబెర్రీ పండ్లు బాగా ఉపయోగపడతాయని తాజా అధ్యయనాల్లో తేలింది. ఈ పండ్లలో ఉండే విటమిన్-సి వల్ల చూపు తగ్గే సమస్య నివారితమవుతుంది. క్రమం తప్పకుండా స్ట్రాబెర్రీలు తినడం వల్ల ఈ సమస్యను దాదాపు 36 శాతానికి పైగా నివారించవచ్చని తేలింది. ఈ అధ్యయన ఫలితాలను ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీ’లో ప్రచురించారు.
క్యాన్సర్ నివారణ కోసం
స్ట్రాబెర్రీలలో ఉండే యాంథోసయనిన్, ఎలాజిక్ యాసిడ్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్ల వల్ల అనేక రకాల క్యాన్సర్లు నివారితమవుతాయని తేలింది. ఇదే విషయాన్ని ‘జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫుడ్ కెమిస్ట్రీ’లో ప్రచురించారు. స్ట్రాబెర్రీలు తినేవారిలో ఊపిరితిత్తులు, ఈసోఫేగస్, రొమ్ము క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువని ఈ అధ్యయనంలో తెలిసింది.
గర్భవతుల కోసం
గర్భధారణ ప్లాన్ చేసుకున్న స్త్రీలకు, గర్భం వచ్చిందని తెలిసిన మహిళలకు డాక్టర్లు రాసే ముఖ్యమైన పోషకం ఫోలిక్ యాసిడ్. ఇది పుట్టబోయే పిల్లల్లో వెన్ను సంబంధిత లోపమైన స్పైనాబైఫిడా వంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు... ఫోలిక్ యాసిడ్ ఎర్రరక్తకణాలు వృద్ధిచెందడానికి, మూడ్స్‌ను మెరుగుపరచే సెరటోనిన్ వంటి మెదడు రసాయనాలు స్రవించడానికి కూడా ఉపయోగపడుతుంది. స్ట్రాబెర్రీలతోనూ ఫోలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు వచ్చే ప్రయోజనాలే స్ట్రాబెర్రీలతో కలుగుతయంటున్నారు పరిశోధకులు. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. స్ట్రాబెర్రీస్ కొందరిలో అలర్జీలను కలిగిస్తాయి. దాంతో అవి సరిపడని వారిలో ఎగ్జిమా, చర్మం మీద దద్దుర్లు, తలనొప్పి, నిద్రలేమి కలిగే అవకాశం ఉన్నందున స్ట్రాబెర్రీలతో అలర్జీ వచ్చే వారు మాత్రం దీని నుంచి దూరంగా ఉండాలి.