
పెరుగుతున్న గర్భిణీ మరణాలు
- ఐదేళ్లలో 270 మంది మృతి
పింప్రి: గర్భిణీ మహిళల కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ వారి మరణాలను మాత్రం అరికట్టలేకపోతోంది. స్థానిక సంస్థల ద్వారా అనేక పథకాలు ప్రవేశ పెట్టినప్పటికీ మరణాలను నివారించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. పుణేలో 2010-11లో 37, 2011-12లో 45, 2012-13లో 64, 2013-14లో 53, ఏప్రిల్1వ తేదీ 2014 నుంచి మార్చి 2015 వరకు 66 గర్భిణీ మరణాలు సంభవించినట్లు కార్పోరేషన్ ఆరోగ్య విభాగం ప్రకటించింది. గత ఐదేళ్లలో 66 మంది గర్భిణీలు మరణించడం ఆదోళనకు గురి చేస్తుంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా గర్భిణీ మహిళలు, శిశువుల సంరక్షణ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
మన దేశంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఉచిత అంబులెన్స్, ఆరోగ్య సేవలు, సలహాలు, సందేహాలకు గ్రామీణ ప్రాంతాల్లో వాలెంటీర్లను ఆరోగ్య విభాగం ఏర్పాటు చేస్తోంది. ఈ విషయంగా కార్పొరేషన్ సహాయక ఆరోగ్య అధికారి డాక్టర్ వైశాలీ సాబణే మాట్లాడుతూ.. సమయానికి ఆరోగ్య సదుపాయాలు అందకపోవడం, రక్త పోటు, వికారం, డెంగీ లాంటి వ్యాధుల వల్ల మృతుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్లు సమయానికి అందుబాటులోలేక పోవడం లాంటి కారణాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. గర్భిణీ మృతుల వివరాలను సేకరించి ఆయా ప్రాంతాలలో జన జాగృతి, ఆరోగ్య వైద్య సదుపాయాలను కార్పొరేషన్ కల్పించాల్సినఅవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.