
గర్భిణులకు హజ్ యాత్ర నిషేధం!
బారెల్లీ: సెంట్రల్ హజ్ కమిటీ కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. హజ్ యాత్రకు నాలుగు నెలలు దాటిన గర్భిణిలు రాకూడదంటూ నిషేధం విధించింది. దరఖాస్తులు పెట్టుకునే సమయానికి గర్భం ధరించి ఉన్నవారు యాత్రను కొనసాగించేముందు ఆలోచించి అడుగు వెయ్యాలని హెచ్చరించింది. వాస్తవాన్ని దాచిపెట్టి హజ్ యాత్రను కొనసాగించినవారిని ఫ్లైట్ ఎక్కేందుకు అనుమతించేది లేదని, అయితే విమానంలో మహిళలపై ఎటువంటి తనిఖీలు జరుపుతారన్న విషయంలో ఇంకా స్పష్టత లేదని హజ్ అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఏడాది హజ్ యాత్ర సెప్టెంబర్ లో ప్రారంభం అవుతుందని బారెల్లీ హజ్ సేవా సమితి సెక్రెటరీ నజీమ్ బేగ్ తెలిపారు. అయితే కొత్తగా తీసుకున్న నిర్ణయాల మేరకు గర్భం దాల్చి నాలుగు నెలలు నిండిన వారిని తీర్థయాత్రకు అనుమతించేది లేదని, ఆ విషయాన్ని ధరఖాస్తు చేసుకునే ముందే మహిళలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ విషయం తెలియక యాత్రకు బయల్దేరినా వారు తనిఖీల్లో పట్టుబడితే వెనక్కు పంపించేస్తామని, ఎట్టిపరిస్థితిలో తీర్థయాత్రకు అనుమతించేంది లేదని స్సష్టం చేశారు. అంతేకాక వారి సీట్లను రద్దు చేసి డబ్బును వెనక్కు తిరిగి ఇచ్చేస్తామని హజ్ కమిటి ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెహ్మాన్ తెలిపారు.
హజ్ యాత్రలోని మొదటి ఐదు రోజులు మనుషుల్లో సహన శక్తికి, ఓర్పుకు పరీక్షలాంటిదని, వారిని ఒకచోటనుంచి మరోచోటకు త్వరితగతిన తరలించడం జరుగుతుంటుందని, యాత్రలో భాగంగా అక్కడి పుణ్య స్థలాల్లో ప్రదక్షిణలు చేయాల్సి వస్తుందని, అటువంటి సమయంలో గర్భిణుల ఆరోగ్యం, భద్రత కోసమే ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు హజ్ కమిటి సెక్రెటరీ బేగ్ తెలిపారు.
మరోవైపు యాత్రలో ఉండగా గర్భిణులకు నొప్పులు వస్తే హజ్ కమిటి ఆస్పత్రిలో చేర్పించి తమ ఖర్చులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉందని, అందుకే అటువంటి మహిళల యాత్రపై నిషేధం విధించాల్సి వచ్చిందని, దీంతో వారిని ముందుగానే పరీక్షించేందుకు కోరుతున్నామని బేరెల్లీ హజ్ సేవా సమితి ప్రెసిడెంట్, బహేరీ ఎమ్మెల్యే అతౌర్ రెహ్మాన్ తెలిపారు.