మీకూ సానియా, సింధూ పుట్టొచ్చు కదా!
హైదరాబాద్ : "ఆడ పిల్లలని తెలిస్తే అబార్షన్ చేయించుకోవడం నేరమే కాకుండా... ఆడవారై ఉండి ఆడపిల్లల పట్ల అన్యాయం చేసిన వారవుతారు..ఏమో..! మీ కడుపులో ఒక సానియా...మరో సింధు లేదా సాక్షినో పుట్టొచ్చు కదా.! ఆడపిల్లల్ని రక్షించుకుందాం...చదివించుకుందాం...!'' అంటూ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా గర్భిణిలకు లేఖ రాశారు. "బేటీ బచావో...బేటీ పడావో'' ప్రచారంలో భాగంగా ఆరోగ్యలక్ష్మి పథకం లబ్దిదారులైన సుమారు ఆరువేల మంది గర్భిణిలకు ఆయన లేఖ రాశారు. హైదరాబాద్ లో ఆడపిల్లల జనాభా తక్కువగా ఉందని, 2001 లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు 918మంది ఆడపిల్లలే ఉన్నారన్నారు.
నిజానికి వెయ్యి మంది ఆడపిల్లలు పుట్టి ఉండాలి కదా..! కానీ పుట్టడం లేదని, కాదు...మనమే పుట్టనివ్వడం లేదని, స్కానింగ్ ద్వారా గర్భంలో ఉన్నది ఆడపిండమా? మగ పిండమా..? అని తెలుసుకుని ఆడపిల్లలను అబార్షన్ ద్వారా చంపేస్తున్నామని, గర్భస్థ ఆడపిండాన్ని హత్య చేయడం చట్టప్రకారం నేరమన్నారు. అవకాశం ఇస్తే ఆడపిల్లలు అన్నింటా రాణిస్తారని, అందుకు మన హైదరాబాద్ అమ్మాయి సానియా మీర్జానే ఒక నిదర్శనమన్నారు. అదేవిధంగా రియో ఒలింపిక్స్ లో సింధు, సాక్షి, దీప అనే ముగ్గురు అమ్మాయిలు పతకాలు గెలుచుకుని దేశానికి కీర్తితో పాటు ప్రపంచస్థాయికి తీసుకెళ్లి అందరితో జేజేలు పలికించారన్నారు. మీ కడుపులో కూడా అలాంటి ఆణిముత్యాలు పుట్టొచ్చు కదా...! ఆలోచించండి అంటూ కలెక్టర్ లేఖ రాశారు.