సాక్షి, హైదరాబాద్: కరోనా అనుమానిత లక్షణాలపై శ్వాస ఆడకపోవడం, జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న పిల్లలు, గర్భిణులకు టీకాలు వేయొద్దని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. టీకాల కోసం రావొద్దని వారికి సూచించాలని కోరింది. కరోనా మార్గదర్శకాల ప్రకారం వారికి టీకాలు ఇవ్వకూడదని తెలిపింది. అయితే లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో కంటైన్మెంట్ ఏరియాలు మినహా ఇతర ప్రాంతాల్లో ఇతర గర్భిణులు, చిన్న పిల్లలకు రెగ్యులర్ వ్యాక్సిన్లు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో అమలైనప్పుడు దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం దాదాపు నిలిచిపోయింది.
అత్యవసర సేవలు మినహా ఆసుపత్రులు, వైద్య సిబ్బంది మొత్తం కరోనా విధుల్లోనే నిమగ్నమైపోయారు. సడలింపులు ఇచ్చినందున తిరిగి వ్యాక్సిన్ల కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని కేంద్రం కోరింది. అయితే కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని చోట్లా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేసింది. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల వారీగా ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలన్న దానిపై ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జోన్లను నిర్ణీత çసమయంలో కేంద్రం సవరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని మాత్రమే వ్యాక్సిన్లు వేయాలని కేంద్రం పేర్కొంది. అయితే పుట్టినప్పుడు వేసే టీకాలు మాత్రం జోన్లతో సంబంధం లేకుండా అందరికీ వేస్తారు. వివిధ మండలాల ప్రకారం టీకాల కార్యక్రమాన్ని, అందుకు సంబంధించిన వ్యూహాన్ని అమలు చేస్తారు.
కేంద్ర మార్గదర్శకాలు ఇవి..
► గర్భిణులు, పిల్లలకు టీకాలు వేసేటప్పుడు ఆయా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలి.
► ప్రతి ఒక్కరి మధ్య కనీసం ఒక మీటరు భౌతిక దూరం ఉండాలి. మాస్క్‌లు ధరించాలి.
► వ్యాక్సిన్లు వేసే చోట ఐదుగురి కంటే ఎక్కువగా ఉండకూడదు.
► భౌతిక దూరం పాటించేలా అవసరమైన స్థలాన్ని పంచాయతీ లేక పట్టణ స్థానిక సంస్థలను కోరాలి.
► ప్రసవ కేంద్రాల్లో టీకాలు కొనసాగించాలి.
► టీకాలు వేసే సిబ్బంది మూడు లేయర్ల సర్జికల్ మాస్క్, గ్లౌజులు ధరించాలి.
► ప్రతి బిడ్డకు టీకాలు వేసిన తర్వాత సిబ్బంది చేతులను సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రపరుచుకోవాలి.
► గర్భిణులకు, వారి వెంట వచ్చే వారికి సీట్లు ఏర్పాటు చేయాలి.
► ప్రవేశ ద్వారం వద్ద హ్యాండ్ శానిటైజర్ లేదా హ్యాండ్ వాషింగ్ యూనిట్లు అందుబాటులో ఉండాలి. ఆ తర్వాత కూర్చునే స్థలాన్ని క్రిమిసంహారకం చేయాలి.
► నిర్ణీత జాబితాలో ఉన్న పిల్లలు, గర్భిణులకు స్లాట్ల ప్రకారం సమయం కేటాయించాలి.
► వెయ్యి జనాభా ఉన్న గ్రామంలో ప్రతి నెలా సరాసరి 25–30 మంది టీకా వేయించుకునేవారు ఉంటారు. ఆ ప్రకారం వేయాలి.
► అంగన్‌వాడీ కేంద్రం కాకుండా ఇతర ప్రదేశాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హాళ్లను గుర్తించాలి.
► ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నందున ఉన్న సిబ్బంది సరిపోకపోతే, రిటైర్ అయిన ఏఎన్‌ఎం, స్టాఫ్ నర్సులు తదితర వైద్య సిబ్బందిని నియమించుకోవాలి.
► పట్టణ ప్రాంతాల్లో సామాజిక దూరాన్ని పాటించేందుకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిటీ సెంటర్లు, మ్యారేజ్ హాళ్లు, స్కూళ్లు, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు.
► టీకాలు వేయడం, అవగాహన కల్పిం చడం, టీకాలు వేయించుకోని పిల్లలను గుర్తించడం తప్పనిసరి.
► ఇచ్చిన స్లాట్ ప్రకారం వచ్చేలా ఒక రోజు ముందే ఫోన్ చేసి రావాలని కోరాలి.
► ఇంట్లో తయారుచేసిన మాస్క్‌లను ఉపయోగించాలని సలహా ఇవ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment