సాక్షి, హైదరాబాద్: కలుషిత రక్తం సరఫరా చేయటంతో హెచ్‌ఐవీ బారిన పడిన ఓ మహిళకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్‌ను రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఆదేశించింది. నాలుగు వారాల్లోపు బాధిత మహిళకు డబ్బు అందచేయాలని నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్‌ను ఆదేశిస్తూ వినియోగదారుల ఫోరం ప్రిసైడింగ్ అధికారి ఆర్.లక్ష్మీనరసింహారావు, సభ్యులు భుజంగరావు, టి.అశోక్‌కుమార్‌లతో కూడిన బెంచ్ ఇటీవల తీర్పునిచ్చింది. కొంతకాలం కిందట నెల్లూరులో కాన్పు కోసం ఆస్పత్రిలో చేరిన ఓ మహిళకు రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు నుంచి కొనుగోలు చేసిన రక్తం ఎక్కించగా.. దాని ద్వారా ఆమెకు హెచ్‌ఐవీ సోకింది. దీనిపై ఆమె ఫోరంను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయానికి రూ.95 లక్షల మేర పరిహారం చెల్లించాలని కోరింది.