
పాలమూరు : ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు చేరువ చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్న రాష్ట్రప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పుట్టిన బిడ్డ, బాలింతతో పాటు గర్భిణులకు మెరుగైన వైద్యం అందేలా ‘అమ్మ ఒడి’ పేరిట వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ వాహనాల ద్వారా తల్లీబిడ్డలకే కాకుండా గర్భిణులకు వైద్యం అవసరమైతే 102 నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు.. ఇంటికి వచ్చి వాహనంలో ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు పూర్తయ్యాక తిరిగి ఇంటి వద్ద దిగబెడుతారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాకు కేటాయించిన 22 వాహనాలు శుక్రవారం ఇక్కడకు చేరుకున్నాయి. వీటిని మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ ఆవరణలో ఉంచగా, వారం రోజుల్లో ప్రారంభించే అవకాశముంది.
కిట్‌తో కిటకిట
కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టాక ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో మెరుగైన వసతుల కల్పనపై దృష్టి సారించారు. ఇదే సమయంలో ఉన్న ఊరు నుంచి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేందుకు రవాణా ఖర్చుల సైతం లేని దుస్థితిలో బాధను పంటి బిగువున భరిస్తున్న మహిళల కోసం అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. గర్భిణిగా నమోదైన నాటి నుంచి ప్రసవం అనంతరం చిన్నారికి పరీక్షల నిర్వహణ వరకు ఉచితంగా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఈ పథకం ద్వారా వాహనాలు కేటాయించారు.
22 వాహనాలు అందుబాటులోకి..
అమ్మ ఒడి పథకంలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కొడంగల్, షాద్‌నగర్ నియోజకవర్గాలు మినహా మిగత 12 నియోజకవర్గాలకు కలిపి 22 వాహనాలు అందుబాటులోకి రానున్నా యి. కాగా, ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో ఆ రు అమ్మ ఒడి వాహనాలు ఉండడం విశేషం. ఈ మేరకు ఏయే జిల్లా, ఏయే ఆస్పత్రి పరిధిలో పరిధిలో ఎక్కువగా ప్రసవాలు గుర్తించి ఆ ప్రాంతాలకు నూతనంగా వచ్చిన వాహనాలను కేటాయిస్తారు. వాహనాల కోసం 102 ఫోన్ నంబర్ కేటాయించారు. వైద్యపరీక్షలు అవసరమైన గర్భిణులు, బాలింతలు ఈ నంబర్‌కు ఫోన్ చేసి న వెంటనే వారి ఇళ్ల వద్దకు చేరేలా చర్యలు తీసుకుం టోంది. అయితే, ప్రయాణం మధ్యలో గర్భిణులు, బాలింతలకు అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే ఎమర్జెన్సీ కిట్ అందుబాటులో ఉంచారు. ఇదేకాకుండా ప్రయాణ సమయంలో వైద్య పరీక్షల అవసరం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ఆడియోను వినిపిస్తారు.
మాతాశిశు మరణాలు తగ్గింపే లక్ష్యం
మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి వైద్యుల సూచనలు పాటించాల్సి ఉంది. మూడు, ఆరు తొమ్మిది నెలల్లో వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడంతో పాటు ప్రసవించాక చిన్నారికి నిర్ణీత సమయంలో టీకాలు ఇప్పించాలి. వీటిని కొందరు పాటిస్తున్నా.. మరికొందరు రకరకాల కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి నివారణ కోసం ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment