
ఆ టైమ్‌లో ఆరోగ్యకరంగా తినండి... ఇద్దరి కోసం వద్దు..!
పరి పరిశోధన
గర్భవతులుగా ఉన్నవారు తమ న్యూట్రిషనిస్ట్ చెప్పిన మేరకు ఆరోగ్యకరంగా ఆహారం తీసుకోవాలి తప్ప... కడుపులో ఉన్న బిడ్డ కోసం అంటూ రెండింతలు తినకూడదని సలహా ఇస్తున్నారు నిపుణులు. గర్భవతులు ఉన్న ఇండ్లలోని కొందరు ‘ఇద్దరి కోసం తినాలి’ అంటూ సలహా ఇస్తుండటం సాధారణంగా కనిపించే అంశం. నిజానికి గర్భం దాల్చిన వారు ఇలా ఇద్దరి కోసం అంటూ రెట్టింపు తినడం అంత మంచిది కూడా కాదని పేర్కొంటున్నారు పరిశోధకులు. ఇలా అధికంగా తినడం తల్లికీ, బిడ్డకూ అనర్థం తెస్తుందని తెలుపుతున్నారు వారు.
ఇలా ఇద్దరి కోసం అని తినే తల్లుల తాలూకు బిడ్డలకు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు అధ్యయనవేత్తలు. ఒకటీ, రెండేళ్లు కాదు... పిల్లలకు దాదాపు పదేళ్లు వచ్చే వరకూ ఈ ప్రమాదం వెంటాడుతూ ఉంటుందట. గర్భం సమయంలో వచ్చే ‘జెస్టేషనల్ డయాబెటిస్’తో బాధపడ్డ తల్లుల తాలూకు పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశాలు 30 శాతం ఎక్కువ అని ఈ అధ్యయన ఫలితాలు పేర్కొంటున్నాయి.
ఇక మిగతా తల్లుల్లోనూ ఒకవేళ వారు గర్భవతులుగా ఉన్నప్పుడు దాదాపు 18 కిలోల కంటే ఎక్కువ బరువును సంతరించుకుంటే వారికి పుట్టే పిల్లల్లోనూ ఊబకాయం వచ్చే అవకాశాలు 15 శాతం ఎక్కువట. ఈ పిల్లలకు రెండు నుంచి పదేళ్ల వచ్చే వరకు ఊబకాయం వచ్చే అవకాశాలు ఉంటాయని అమెరికాలోని ‘కెయిజర్ పర్మనెంట్ సెంటర్ ఫర్ హెల్త్ రీసెర్చ్’ సంస్థ పేర్కొంది.
దాదాపు 24,000 పైగా మంది తల్లులూ, వారి బిడ్డలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తేలింది. పదేళ్లకు పైగా కొనసాగిన ఈ అధ్యయన బృందానికి చెందిన డాక్టర్ థెరెసా హిల్లియర్ అనే ఎండోక్రైనాలజిస్ట్ మాట్లాడుతూ... ‘‘సాధారణంగా గర్భవతులలో బరువు పెరుగుతున్న కొద్దీ వాళ్ల రక్తంలో చక్కెరపాళ్లు పెరగడమే గాక, అది వాళ్ల బిడ్డలలోని జీవక్రియల వేగం పెంచవచ్చు. ఇలా వాళ్ల మెటబాలిజంలోని పెరుగుదల ఆ తర్వాత పిల్లల్లో ఊబకాయానికి దారితీయవచ్చు’’ అని పేర్కొన్నారు.
‘‘అయితే ఈ ఒక్క అంశమే గాక... పరిసరాలు, బిడ్డ పుట్టాక తల్లిపాలపై పెరగకపోవడం, పిల్లల్లో తగినంత వ్యాయామం కొరవడటం వంటి అనేక అంశాలు సైతం వారిలో ఊబకాయానికి దారితీస్తాయ’’ని తెలిపారు డాక్టర్ హిల్లియర్. ఈ అధ్యయన ఫలితాలు ‘మెటర్నల్ అండ్ ఛైల్డ్ హెల్త్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి.