
బాలింత ఉసేనమ్మ, జన్మించిన బిడ్డను చూపుతున్న అవ్వ
కర్నూలు,కౌతాళం: కౌతాళంలో ఆదివారం సాయంత్రం ఓ మహిళ నడిరోడ్డుపైనే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు స్థానికంగా ఉన్న మహిళలు సహాయం చేశారు. బాపురం గ్రామానికి చెందిన ఉసేనమ్మ ఆదివారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా గ్రామం నుంచి ఆటోలో మండల కేంద్రమైన కౌతాళం ప్రాథమిక వైద్యశాలకు కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. అక్కడున్న వైద్య సిబ్బంది పరీక్షించి కాన్పు కష్టంగా ఉందని, వెంటనే ఆదోనికి తీసుకుపోవాలని సూచించారు. జనతా కర్ఫ్యూతో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అది ఎంతసేపటికీ రాకపోవడంతో తాము వచ్చిన ఆటోలోనే ఆదోనికి తరలిస్తుండగా.. వైద్యశాల నుంచి అరకిలోమీటరు దూరం వెళ్లకుండానే నొప్పులు అధికమయ్యాయి. ఆటోను అక్కడే నిలిపివేయగా స్థానిక మహిళలు వచ్చి ఉసేనమ్మకు సహాయం చేశారు. దీంతో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కాన్పు సమయంలో అధికంగా రక్తస్రావం జరగడంతో ఉసేనమ్మను చికిత్స కోసం ఆదోనికి తరలించారు.