* అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు కరువు
* అరకొర వసతులతో చిన్నారుల చిక్కులు
* ఏళ్లు గడిచినా నిర్మాణ దశలోనే భవనాలు
* పట్టించుకోని అధికారులు
ఆదిలాబాద్ టౌన్ : భావిపౌరుల భవిష్యత్‌కు అంధకారం పట్టుకుంది. బంధీఖానాలను తలపిస్తున్న భవనాల్లోనే కాలం వెల్లదీయాల్సిన దుస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం.. పాలకుల అలసత్వం.. వెరసి ఏళ్ల తరబడి వేదన మిగులుతోంది. ఏళ్లుగా అంగన్‌వాడీలకు అద్దె భవనాలే దిక్కవడంతో చిన్నారులు ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా 3,281 ఉన్నాయి. ఇందులో 2,534 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, 747 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 2010లో నాబార్డ్ పథకం కింద 184 అంగన్‌వాడీ కేంద్రాలు, 2013 సంవత్సరంలో ఏపీఐపీ పథకం ద్వారా 133 కేంద్రాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నిధులు విడుదలై ఐదేళ్లు గడుస్తున్నా ఆ పనులు ఇప్పటివరకు నిర్మాణ దశలోనే మగ్గుతున్నాయి.
కేంద్రాల్లో సౌకర్యాలు కరువు...
సౌకర్యాలు లేమితో అంగన్‌వాడీలు నిర్వహిస్తుండడంతో గర్భిణులు, చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం గాలి, వెలుతురు కూడా సరిగా లేని గదుల్లోనే వాటిని కొనసాగిస్తున్నారు. గతంలో ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలోని కేంద్రాలకు రూ.750, గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు రూ.200 చొప్పున అద్దె చెల్లించేది. అయితే ఏప్రిల్ నుంచి పట్టణాల్లో రూ.3 వేలు, గ్రామాల్లో రూ.750లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో పట్టణాల్లో కొంత మంది మంచి భవనాలనే అద్దెకు తీసుకున్నారు. మరికొంత మంది పాత భవనాల్లోనే కొనసాగిస్తూ కొత్తవాటిలోకి మారినట్లు చూపుతున్నారు.
భవనాలకు అద్దె చెల్లింపు విషయంలో కూడా నెలనెలా సక్రమంగా అందించిన సందర్భాలు లేవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 500-600 అడుగుల విస్తీర్ణంలో మూడు గదులు, తాగునీరు, ఫ్యాన్, మరుగుదొడ్లు, ఆటస్థలం ఉండాలి. చిన్నారులను ఒక గదిలో ఇరుకుగా కూర్చోబెట్టడం, వంటగది, మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఫ్యాన్, కరెంట్ సదుపాయం కూడా సరిగా లేకపోవడంతో చిన్నారులతోపాటు అంగన్‌వాడీ కార్యకర్తలు కూడా సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు.
13 నెలల నుంచి అద్దె బకాయి..
అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రైవేట్ భవనాలకు సకాలంలో అద్దె చెల్లించడం లేదు. నెలల తరబడి ప్రభుత్వం పెండింగ్‌లో పెడుతుండడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. యజ మానుల ఒత్తిడితో కొంత మంది అంగన్‌వాడీలు తమ వేతనం నుంచి అద్దె చెల్లిస్తున్నారు. తక్కువ అద్దెనే చెల్లించలేని ప్రభుత్వం కొత్తగా పెంచిన అద్దె ఎలా ఇస్తుందని అందరి మదిలో నెలకొన్న ప్రశ్న ఇది. అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.3,700 ఉండగా అద్దె రూ.3 వేలు ఎలా చెల్లిస్తారని వారు వాపోతున్నారు. 13 నెలలుగా కేంద్రాల అద్దె బకాయి ఉండడంతో అవస్థలు పడుతున్నారు.
అద్దెలు పెంచడంతో ఆనందంలో మునిగిన కార్యకర్తలు నిబంధనలు చూసి నివ్వెరపోతున్నారు. అందుకే ఏడాది గడిచినా చాలా మంది ముందుకు రావడం లేదు. అధికారులు అడిగినప్పుడల్లా అదిగో.. ఇదిగో అంటూ తప్పించుకుంటున్నారు. ఇదేమిటని వారు ప్రశ్నిస్తే ఈ అద్దెకు ఎక్కడా భవనాలు దొరకడం లేదని చెబుతున్నారు. కొందరైతే పెంచిన అద్దెను పాత వాటికే చెల్లిస్తారని భావించామని అంటున్నారు.
ప్రతిపాదనలు పంపించాం...
- నారాయణ, ఐసీడీఎస్ సూపరింటెండెంట్
అంగన్‌వాడీ కేంద్రాల సొంత భవనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. 2010లో 184 కేంద్రాలకు, 2013లో 133 కేంద్రాల నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయి. వాటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,281 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 2,534 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. భవనాల అద్దె నిధులు వచ్చిన వెంటనే చెల్లిస్తాం.
అద్దె భవనాలే దిక్కు..
Published Sun, Nov 2 2014 4:50 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement