కడప కోటిరెడ్డి సర్కిల్ :అసలే బుద్ధిమాంద్యం పిల్లలు.. వారి సంక్షేమ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే ఆ నిధులను కూడా కొందరు అధికారులు దిగమింగారు. మహిళా శిశుసంక్షేమ శాఖలోని అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో దివ్యాంగులుగా ఉంటున్న వారిలో 60శాతం వైకల్యం ఉన్న వారిని గుర్తించి వారికి చికిత్స అందించేందుకు డబ్బులు మంజూరయ్యాయి. ఆ డబ్బులు అంగన్‌వాడీల ద్వారా పంపిణీ చేయాలనేది ఈ పథకం ఉద్దేశం. ప్రధానంగా బుద్ధిమాంద్యం పిల్లలు ఏయే కేంద్రాల పరిధిలో ఉన్నారు. ఎలాంటి బుద్ధిమాంద్యంతో ఉన్నారో వివరాలు సేకరించి నివేదికలను సంబంధిత అధికారులకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ ప్రకారం అంగన్‌వాడీల పరిధిలో కొందరు మాత్రమే సర్వే చేసి ఆ నివేదికలను సంబంధిత అధికారులకు అందజేశారు. మిగతా వారు అందజేయలేదని సమాచారం.
అసలు ఏం చేయాలంటే..
మానసికంగా రోగాలతో ఉన్న, ఇతర అనారోగ్య సంబంధమైన, అవయవాలు పనిచేయని పిల్లలను బుద్ధి మాంద్యం పిల్లలుగా గుర్తిస్తారు. అంగన్‌వాడీ ఆయాలు, కార్యకర్తలు గుర్తించిన పిల్లలను ఎముకలు, చర్మం, వినికిడి తదితర అవయవాల విభాగం డాక్టర్లు పరీక్షించి సర్టిఫికెట్ ఇస్తారు. ఆ ప్రకారం ఆయా పిల్లల డబ్బులు వారి తల్లి దండ్రులకు అప్పగించాలనేది దీని ఉద్దేశం. ఈ బుద్ధి మాంద్యం పిల్లలను అంగన్‌వాడీ ప్రాజెక్టుల వారీగా 60 శాతంపైగా ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని నివేదికలు తయారు చేయాలని అధికారుల ఉత్తర్వులు అందుకున్న సీడీపీఓల్లో కొందరు మాత్రమే నివేదికలు సమర్పించారు. ఆ నివేదికల ఆధారంగా రిమ్స్‌లోని ఆయా అవయవ విభాగాల వైద్యుల బృందం బుద్ధిమాంద్యత పిల్లల్లో 60 శాతం మానసిక వైకల్యం ఉందా? లేదా అని గుర్తించి సర్టిఫికెట్ ఇస్తారు.
ఒక్కో పిల్లోడికి రూ.5 వేలు
బుద్ధి మాంద్యం ఉన్న పిల్లల్లో ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రకారం అంగన్‌వాడీ సీడీపీఓలకు మంజూరయ్యాయి. కొందరు సీడీపీఓలు మాత్రమే పిల్లల తల్లిదండ్రులకు చెల్లించారు. ఇద్దరు సీడీపీఓలు తిరిగి ప్రభుత్వానికి వాపసు చేశారు. మిగతా వారు చెల్లించకుండా అంటిపెట్టుకుని కూర్చున్నారు.
రూ.10లక్షలు స్వాహా !
బుద్ధిమాంద్యం పిల్లల ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వం ఒక్కొక్క ప్రాజెక్టు పరిధిలో ఉన్న పిల్లల కోసం దాదాపుగా రూ.1.25 లక్షలు ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ ప్రకారం రూ.10 లక్షలుపైగా మంజూరైంది. అయితే ఇటీవల ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో అలాగే మిగిలిపోయి ఉన్న నిధులను తిరిగి చెల్లించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ ప్రకారం జిల్లా కలెక్టర్ బాబురావు నాయుడు సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మీమీ శాఖలో ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధులను వెనక్కి ఇవ్వాలని ఆదేశించడంతో ఈ నిధుల వ్యవహారం వెలుగు చూసింది.
జిల్లాలోని 15 ప్రాజెక్టుల్లో కలిపి మొత్తం రూ.10 లక్షల వరకు నిధులు మూలుగుతున్నాయి. ఈ నిధులు ఏమయ్యాయో తేలాల్సి ఉంది. రైల్వేకోడూరు మండలం మంగంపేట ముగ్గురాయి గనుల విస్తరణలో భాగంగా మూడు గ్రామాల్లోని అంగన్‌వాడీ భవనాలను పడగొట్టారు. దానికిగాను గనులశాఖ అధికారులు రూ.15 లక్షలు ఐసీడీఎస్ శాఖ ఉన్నతాధికారుల ఖాతాకు జమ చేయగా అది కూడా స్వాహా చేశారు. బుద్ధి మాంద్యం పిల్లల సొమ్ములు కూడా అంతేనా అని ఆ శాఖలోని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
నిధులను వెనక్కి రప్పిస్తాం
ఏయే ప్రాజెక్టు పరిధిలో ఈ బుద్ధి మాంద్యం పిల్లల కోసం నిధులు వచ్చాయో తెలుసుకుని ఆ నిధులను వెనక్కి పంపాలని సీడీపీఓలను ఆదేశిస్తున్నాం. ఎంత మొత్తం ఉన్నది వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి పంపుతాం. ప్రభుత్వ సొమ్ములు ఎవరు దిగమింగినా చర్యలు తప్పవు. – మమత, జిల్లా పీడీ, ఐసీడీఎస్ కడప
Comments
Please login to add a commentAdd a comment