నిర్లక్ష్యానికి నిండు గర్భిణి బలి
Published Thu, Aug 29 2013 3:11 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
కొత్తూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిండు గర్భిణి మృతి చెందిన సంఘటన కొత్తూరు మండలంలోని కర్లెమ్మ పంచాయతీ పరిధి నేతాజీ నగర్ కాలనీలో జరిగింది. పురిటినొప్పులు రావడంతో ఎన్‌ఎన్ కాలనీకి చెందిన గర్భిణి కుమ్మరి లక్ష్మి (26) నాన్నమ్మ పున్నమ్మతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. డ్యూటీ వైద్యులు శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి వైద్యం అందించారు. సుమారు మూడు గంటలైనప్పటికీ ప్రసవం కాకపోవడంతో పాటు, ఒక్కసారి బీపీ తగ్గడంతో గర్భిణి ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో మెరుగైన వైద్యం కోసం పాలకొండ ఏరియా ఆస్పత్రికి 108 ద్వారా తరలించారు. అయితే మార్గ మధ్యం గొయిది సమీపంలో గర్భిణి చనిపోయినట్టు లక్ష్మి బంధువులు తెలిపారు. మృతి చెందిన లక్ష్మికి భర్త లక్ష్మినారాయణ, కుమారుడు ప్రసాద్‌లు ఉన్నారు.
భర్తతో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఉపాధి కోసం చెన్నై వలస వెళ్లారు. లక్ష్మి గర్భిణి కావడంతో అత్త జడ్డమ్మతో ఇంటి వద్ద ఉంటుంది. అయితే స్థానిక ఆస్పత్రిలో స్త్రీవైద్య నిపుణులను నియమించక పోవడంతో ఈ ప్రాంతానికి చెందిన గర్భణిలకు సకాలంలో వైద్యం అందక పలు అవస్థులు పడుతున్నారు. ప్రసవాలు సమయంలో మెరుగైన వైద్యం కోసం 30 కిలో మీటర్ల దూరంలోని పాలకొండ ఏరియా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుంది. ఐటీడీఏ పాలకవర్గం కూడా ఆస్పత్రిని పట్టించుకోవడం లేదు. మార్పు పేరుతో మాతా శిశుమరణలు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి నెలా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తుంది. కానీ అవసరమైన చోట స్త్రీవైద్య నిపుణులు నియమించకుండా మాతా శిశుమరణాలు తగ్గిచండ అసాధ్యమే.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్థానిక ఆస్పత్రిలో స్త్రీవైద్య నిపుణులును నియమించాలని పలువురు కోరుతున్నారు. లక్ష్మి బీపీ ఒక్కసారి తగ్గడంతో మెరుగైన వైద్యం కోసం పాలకొండ పంపించినట్టు వైద్యుడు శ్రీనివాసరావు తెలిపారు. స్త్రీ వైద్య నిపుణులు, చిన్న పిల్లలు వైద్యల కోసం నోటిషికేషన్లు వేసినా అభ్యర్థులు ముందుకు రావడం లేదని ఆస్పత్రి పర్యవేక్షకులు కృష్ణమోహన్ తెలిపారు.
Advertisement
Advertisement