ఆ‘పరేషన్.. జీజీహెచ్’
సాక్షి ఎఫెక్ట్...
సర్వజనాస్పత్రి ప్రక్షాళనకు శ్రీకారం
గర్భిణుల కోసం అదనపు గదులు
నూతన భవనంలోకి పీడియాట్రిక్ వార్డు
గైనిక్, పీడియాట్రిక్ వైద్యులతో సమీక్ష
మాతాశిశుమరణాలపై అడిషనల్ డీఎంహెచ్‌ఓ ఆరా
అనంతపురం మెడికల్: ప్రసవం కోసం వచ్చిన గర్భిణులు.. ప్రసవం తర్వాత బాలింతలు పడుతున్న కష్టాలపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మాతాశిశు మరణాలు చోటు చేసుకోవడం.. ఆస్పత్రి ఆవరణల్లోనే ప్రసవాలు జరుగుతుండడాన్ని సీరియస్‌గా పరిగణించింది. ఆపరేషన్ జీజీహెచ్ (ప్రభుత్వ సర్వజనాస్పత్రి) చేపట్టి సర్వజనాస్పత్రి ప్రక్షాళణకు శ్రీకారం చుట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
పెద్దాస్పత్రిని నమ్ముకుని వచ్చిన వారికి ‘నిర్లక్ష్య వైద్యం’ అందుతుండడంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన కలెక్టర్ వీరపాండియన్ అసలేం జరుగుతోందంటూ అధికారులను వివరణ కోరారు. తాజాగా డెలి‘వర్రీ’ శీర్షికతో సోమవారం ప్రచురితమైన కథనంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సైతం రంగంలోకి దిగారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌ను అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పద్మావతి కలిసి చర్చించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనే గర్భిణులకు ప్రసవాలు చేసే అవకాశం ఉన్నా అందరూ సర్వజనాస్పత్రికే వస్తున్నారని డాక్టర్ జగన్నాథ్ అన్నారు. దీన్ని కొంత వరకైనా నివారించగలిగితే పరిస్థితి ఇంతలా ఉండబోదని తెలిపారు. అసలే ఇక్కడ పడకల సమస్య తీవ్రంగా ఉందని, పీహెచ్‌సీ స్థాయిలో వైద్య సేవల్ని బలోపేతం చేయాలని కోరారు.
శిశువు మృతి, ఆరుబయట ప్రసవంపై ఆరా
సర్వజనాస్పత్రిలో ఆదివారం తెల్లవారుజామున పెద్దవడుగూరుకు చెందిన అమీన్ ఆరుబయట ప్రసవం కావడం, ఉదయాన్నే కర్నూలు జిల్లాకు చెందిన జయలక్ష్మి ప్రసవించిన అనంతరం బిడ్డను కోల్పోయిన ఘటనలపై అధికారులు ఆరా తీశారు. సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఆర్‌ఎంఓ లలిత, డిప్యూటీ ఆర్‌ఎంఓ విజయమ్మ లేబర్, గైనిక్ వార్డులకు వెళ్లి రెండు గంటలకు పైగా వైద్యులు, సిబ్బందితో చర్చించారు. ఎందుకింత నిర్లక్ష్యం వహించారని ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సాయంత్రం ప్రత్యేకంగా గైనిక్ విభాగం హెచ్‌ఓడీ షంషాద్‌బేగం, గైనకాలజిస్టులతో సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి వచ్చే కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
నూతన భవనంలోకి పీడియాట్రిక్ వార్డు
సర్వజనాస్పత్రిలో కొత్తగా నిర్మించిన భవనంలోకి చిన్న పిల్లల విభాగాన్ని తరలించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా పీడియాట్రిక్ హెచ్‌ఓడీ డాక్టర్ మల్లీశ్వరి, వైద్యులు రాంకిశోర్, ప్రవీణ్‌దీన్‌కుమార్, సుల్తానాతో సూపరింటెండెంట్ సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉన్న పీడియాట్రిక్ వార్డును గర్భిణులు, బాలింతల కోసం కేటాయించనున్నట్లు తెలిపారు. కొత్త భవనంలోకి పీడియాట్రిక్ వార్డు తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించిన భవనం మొత్తం పీడియాట్రిక్‌కే కేటాయించాలని వారు తెలుపగా సూపరింటెండెంట్ ఒప్పుకోలేదు. పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికుల సమస్య ఉందని, ప్రస్తుతానికి 50 పడకలు ఇస్తామని చెప్పారు. ఈ విషయాన్ని డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.