గర్భిణీలకు సీఎం బంపర్ ఆఫర్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. లింగనిర్ధారణ పరిక్షలు జరిపే కేంద్రాల సమాచారం ఇచ్చిన వారికి భారీ నగదు బహుమతిని ప్రకటించారు. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇలాంటి కేంద్రాలను పట్టి ఇచ్చిన గర్భిణులకు రూ. లక్ష నగదు నజరానా ప్రకటించారు.
రాష్ట్రంలో ఆందోళన రేపుతున్న సెక్స్ రేషియో నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ ద్వివేది నిన్న (జూన్ 23) అన్ని జిల్లా అధికారులకు ఒక లేఖ రాశారు. జూలై1 నుంచి రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ సహాయంతో ఈ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలని ఆదేశించారు.
ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం రూ.2లక్షల అవార్డును ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ కేంద్రాల గురించి సమాచారం అందించినవారికి రూ.60వేలు, నిఘా ఆపరేషన్ ద్వారా సహకరించిన గర్భిణీకి రూ. లక్ష ఇస్తారు. దీంతోపాటుగా ఈ ఆపరేషన్‌లో ప్రెగ్నెంట్ మహిళకు తోడుగా వెళ్లిన వ్యక్తికి (భర్త, లేదా ఇతర కుటుంబ సభ్యులు) మరో రూ.40వేలు బహుమతిగా అందించనున్నారు. అయితే వీరు ఈ కేసు విచారణ సమయంలో స్వతంత్ర సాక్షిగా వ్యవహరించాల్సి ఉంటుంది.
మరో కీలక అంశం ఏమిటంటే ఈ నజరానాను మూడు విడతలుగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆపరేషన్ విజయవంతం చేసినపుడు మొదటి విడత, కోర్టులో సాక్ష్యం చెప్పినపుడు రెండవ విడత, శిక్ష పడినపుడు మూడవ విడతగా అందజేస్తారు. కాగా 2011 జనాభా లెక్కల ప్రకారం యూపీలో 1,000 బాలురు ఉండగా బాలికలసంఖ్య 902కి పడిపోయిందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. 2001 లో 916గా నమోదైందనీ, ఈ తగ్గుదల కొనసాగుతోందన్నారు.