మరో పరువు హత్య
♦ గర్భిణిని కడతేర్చారు
♦ అరియలూరులో ఘటన
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. నాలుగేళ్ల క్రితం ప్రియుడితో కలిసి ఉడాయించి న కూతుర్ని వెతికి పట్టి మరీ తల్లిదండ్రులు హతమార్చారు. అరియలూరు జిల్లా సెందురైలో ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో కులాం తర వివాహాలు, ప్రేమ వివాహాలు పరువు హత్యలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. పరువు హత్యల కట్టడి లక్ష్యంగా కోర్టు పలు సూచనల్ని ఇవ్వడమే కాకుండా, ప్రేమికులకు, కులాంతర వివాహాలు చేసుకునేవారికి భద్రత కల్పించే ఆదేశాలు జారీ చేసింది. అయినా, పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు.
మరో పరువు హత్య : అరియలూరు జిల్లా సెందురై సమీపంలోని పొన్ పరప్పి గ్రామానికి చెందిన తంగరాజ్, భవానీల కుమార్తె షర్మిల. సమీపంలోని మరో గ్రామానికి చెందిన కలై రాజన్‌ను ప్రేమించింది. వీరిద్దరూ 2008లో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నారు. అయితే, షర్మిల కుటుంబీకులు ఆ ఇద్దర్ని వెతికి పట్టి మరి విడదీశారు. 2009లో తమ బంధువు అన్భుమణికి ఇచ్చి బలవంతంగా షర్మిలకు వివాహం చేశారు. అన్బుమణితో సాగిన బలవంతపు కాపురంలో ఓ ఆడబిడ్డకు షర్మిల జన్మను ఇచ్చింది.
అయితే, తనకు అన్బుమణితో జీవితం ఇష్టం లేదని తేల్చి 2013లో ఉడాయించింది. ఆ జిల్లాను వదలి పెట్టి ఎవరికీ తెలియని ఊర్లో ప్రియుడు కలై రాజన్‌తో కలిసి సహజీవనం సాగిస్తూ, చిన్న పాటి ఉద్యోగం చేసుకుంటూ జీవన పయనం సాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో గర్బం దాల్చిన షర్మిల ఫిబ్రవరిలో కలైరాజన్‌ను వివాహం చేసుకుంది. ఈ వివాహంతో తమ కుమార్తె ఎక్కడున్నదో అన్న విషయాన్ని కుటుంబీకులు పసిగట్టారు.
గుట్టు చప్పుడు కాకుండా హత్య
ఏడు నెలల గర్భిణిగా ఉన్న తమ కుమార్తెను ఈ సారి నమ్మ బలికి మరీ స్వగ్రామానికి తీసుకెళ్లారు. గ్రామ పెద్దల సమక్షంలో కలైరాజన్‌ను అల్లుడిగా స్వీకరిస్తామన్న ఆశ చూపించారు. తల్లిదండ్రుల వెంట వెళ్లిన షర్మిల ఆదివారం రాత్రి విగత జీవిగా మారింది. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారు. అయితే, పోలీసులు విచారణలో గుట్టు రట్టు అయింది. పరువు హత్య జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. సెందురైలోని బం«ధువుల ఇంటికి షర్మిలను తీసుకెళ్లిన తల్లిదండ్రులు గర్భం తొలగించాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు.
లేదంటే కలైరాజన్‌నూ హతమారుస్తామని బెదిరించారు. తమ మాట వినని ఆమెను కొట్టి చంపి, అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించారని బయట పడింది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పరువు హత్య గుట్టును పోలీసులు వెలుగులోకి తెచ్చినా, ఆ గ్రామంలో సాగుతున్న అగ్రవర్ణాల ఆధిపత్యం వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నట్టు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.