రక్తదానం ఆవశ్యకతను వివరిస్తూ ర్యాలీ చేస్తున్న నర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రక్తం కొరత వేధిస్తోంది. ఆపత్సమయంలో అవసరమైన రక్తం లభించక రోగులు, వారి బంధువులు నరకయాతన అనుభవిస్తున్నారు. రక్తం నిల్వలు క్రమంగా తగ్గిపోతుండడంతో బ్లడ్ బ్యాంకులు సైతం చేతులెత్తేశాయి. ప్రధానంగా ప్రమాద బాధితులు, గర్భిణిలు సమయానికి అవసరమైన రక్తం లభించక విలవిలలాడుతున్నారు. మీ బంధువులు ఎవరైనా ఉంటే వచ్చి రక్తమిస్తే తప్ప తామేమి చేయలేమంటూ డాక్టర్లు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో 62 శాతం మంది గర్భిణుల్లో రక్తహీనత సమస్య ఉంది. ఏటా రాష్ట్రంలో 8 లక్షల ప్రసవాలు జరుగుతూంటే అందులో 4.80 లక్షల మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నవారే. వీళ్లు ప్రసవానికి వచ్చినప్పుడు రక్తం ప్రధాన సమస్యగా మారింది. రాష్ట్రంలో ఏడాదికి 5 లక్షల యూనిట్లు అవసరమైతే 3.7 లక్షల యూనిట్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి. వేసవిలో పరిస్థితి దారుణంగా ఉంటోంది. మిగతా రోజుల్లో కళాశాలల విద్యార్థులు తరచూ రక్తదాన శిబిరాల్లో రక్తం ఇస్తుంటారు. అయితే సెలవులు కావడం, శిబిరాల నిర్వహణ తగ్గిపోవడంతో రక్తం నిల్వలు మరింతగా అడుగంటి పోతున్నాయి.
ప్రమాద బాధితుల ఆవేదన వర్ణనాతీతం
ప్రమాదాల సంఖ్యలో దేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. నెలకు సగటున 30 వేలకు పైగా ప్రమాదాలు జరుగుతుండగా ఏడాదికి సగటున 9 వేల మంది వరకూ మృత్యువాత పడుతున్నారు. సమయానికి రక్తం లభ్యమయితే ఇందులో కొంతమందినైనా కాపాడవచ్చు. ఇక రక్తహీనత జబ్బుతో బాధపడుతున్న గర్భిణులు ప్రసవానికి వస్తే విధిగా రక్తం ఉండాలి. ఒక్కో మహిళకు అవసరాన్ని బట్టి 2 నుంచి 3 యూనిట్ల రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది.
హెచ్‌ఐవీ బాధితులు, తలసేమియా బాధితులు
హెచ్‌ఐవీ బాధితులు ఏకంగా రక్తం కొరతతో మృతి చెందుతున్న ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రకాశం జిల్లాలో రక్తం దొరకక ఇద్దరు హెచ్‌ఐవీ పేషెంట్లు మృతి చెందారు. సాధారణంగా హెచ్‌ఐవీ బాధితులు జడ్‌ఎల్‌ఎన్ (జుడోవిడిన్ లామిడివిడిన్ నెవరపిన్) మందులు వాడతారు. వీటి ప్రభావంతో హిమోగ్లోబిన్ శాతం పడిపోతుంది. ఎంతగా అంటే రక్తం శాతం 4కు పడిపోతుంది. ఈ పరిస్థితుల్లో విధిగా రక్తం ఎక్కించాలి. కానీ వీరికి రక్తం దొరకడం లేదు. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సిన తలసేమియా బాధితుల పరిస్థితి నరకంగా ఉంటోంది. ఆయా బాధితుల తల్లిదండ్రులు పల్లెల్లో రక్త దాతలను బ్రతిమలాడుకోవాల్సి వస్తోంది.
రక్తం ఎవరు ఇవ్వచ్చు
- రక్తం ఇవ్వడానికి 21– 60 మధ్య వయస్సు వారు ఎవరైనా ఇవ్వవచ్చు
- ఆరోగ్యవంతులై ఉండాలి... హెచ్‌ఐవీ, బీపీ, మధుమేహ వ్యాధి గ్రస్థులై ఉండకూడదు
- ఒక్కసారి 300 మిల్లీలీటర్ల (యూనిట్) రక్తాన్ని సేకరించవచ్చు
- మళ్లీ మూడు నెలల తర్వాతే రక్తం ఇవ్వాలి
- ఒకసారి రక్తం తీసిన తర్వాత 15 రోజుల్లోగా ఆ రక్తాన్ని వాడుకోవాలి
పరీక్షించే అవకాశమూ లేదు
రక్తం తీసుకోవాలంటే దాతలను పరీక్షించాల్సి ఉంటుంది. హెచ్‌ఐవీ ఉందని రక్త దాతలకు తెలియదు. రక్తం తీసుకుంటున్నప్పుడు చెక్ చేసినా అందులో తేలదు. దీన్నే రోగికి విండో పీరియడ్ అంటారు. అంటే 15 రోజుల నుంచి 3 నెలల లోగా ఎప్పుడైనా హెచ్‌ఐవీ బయటపడచ్చు. దీంతో ఆ రక్తాన్ని ఎవరికైనా ఎక్కించడం వారికి హెచ్‌ఐవీ రావడం ఇటీవల పలు చోట్ల జరిగింది. దీనికి సంబంధించి సరిగ్గా పరీక్షలు నిర్వహించాలంటే మెషీన్ ఖరీదు రూ.48 లక్షలు అవుతుంది. కానీ ఈ మెషీన్లు ఎక్కడా లేవు.
Comments
Please login to add a commentAdd a comment