
ప్రెగ్నెన్సీలో ‘పైకా’తో జాగ్రత్త!
ఆహారంగా పరిగణించని పదార్థాలను తినే రుగ్మతను పైకా అంటారు. సాధారణంగా పిల్లల్లో ఏదో ఒక దశలో కనిపించే ఈ విపరీత ప్రవర్తన పెద్దలలో తక్కువే. అయితే గర్భవతుల్లో మాత్రం కాస్త తరచుగా కనిపిస్తుంటుంది. ఈ రుగ్మత ఉన్నవాళ్లు మట్టి, బియ్యంలో మట్టి గడ్డలు, ఇసుక, పిండి, పెన్సిల్-ఎరేజర్ ముక్కలు, పేపర్, బొగ్గు, చాక్‌పీసులు, కాల్చేసిన అగ్గిపుల్లలు.. ఇలా అనేక రకాల వస్తువులు తింటుంటారు. ఇలా ఎందుకు చేస్తారనడానికి కారణాలు నిర్దిష్టంగా చెప్పలేం. అయితే కొన్ని పరిశీలనలు, అధ్యయనాల ప్రకారం...
ఐరన్, క్యాల్షియం, జింక్, థయామిన్, విటమిన్-సి, విటమిన్-డి లోపాలు ఉన్న ప్పుడు, కొన్ని ఖనిజ లవణాల లోపాలు ఉన్నప్పుడు ఈ సమస్య తలెత్తుతుందని తెలుస్తోంది.
సమస్యలు: ఈ రుగ్మత వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, పొట్టలో పురుగులు రావడం (ఇన్‌ఫెస్టేషన్స్) వంటివి జరగొచ్చు. వెంట్రుకలు, ప్లాస్టిక్ వస్తువులు తినేవారిలో అవి పేగుల్లో ఇరుక్కుపోవడం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. కొన్ని సందర్భాల్లో లెడ్ లాంటి విష పూరితమైన పదార్థాలు కడుపులోకి చేరవచ్చు.
చికిత్స : ఇలాంటి రుగ్మత ఉన్నవారికి మొదట రక్తహీనత (అనీమియా) ఉందా అని పరీక్షించాలి. అలాగే పొట్టలో పురుగులు పోయేలా డీ-వార్మింగ్ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటు ఐరన్, ఇతర విటమిన్లు ఉండే పోషకాహారపు సప్లి మెంట్స్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది. కొందరిలో అరుదుగా మానసిక చికిత్స కూడా అవసరం కావొచ్చు.